మరో న్యూయార్క్‌గా మహారాష్ట్ర

14 Jun, 2020 04:27 IST|Sakshi

లక్ష దాటిన కేసులు

ముగ్గురు మంత్రులకు పాజిటివ్‌

ధనుంజయ్‌ ముండే (ఎన్సీపీ), సామాజిక న్యాయశాఖ మంత్రి

జితేంద్ర అవ్హాద్‌ (ఎన్సీపీ). గృహ నిర్మాణ శాఖ మంత్రి

అశోక్‌ చవాన్‌ (కాంగ్రెస్‌), ప్రజా పనుల శాఖ మంత్రి

సాక్షి, ముంబై: కరోనా వైరస్‌ ఉక్కు పిడికిలిలో చిక్కుకొని మహారాష్ట్ర విలవిలలాడుతోంది. దుబాయ్‌ నుంచి వచ్చిన పుణే జంటకు మార్చి 9న కోవిడ్‌–19 సోకిన దగ్గర్నుంచి 96 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్ష కేసులు దాటేశాయి. మహారాష్ట్ర కనుక ఒక దేశమే అయి ఉంటే, వరల్డో మీటర్‌ ప్రకారం ప్రపంచంలో అత్యధిక కేసుల్లో 17వ స్థానంలో ఉన్నట్టు లెక్క. చైనా, కెనడా వంటి దేశాలను కూడా దాటి పోయి రోజురోజుకీ  కేసుల సంఖ్య పెరిగిపోతోంది. 50 వేలు కేసులు నమోదు కావడానికి 77 రోజుల సమయం తీసుకుంటే మరో 50 వేల కేసులు కేవలం 19 రోజుల్లో దాటాయంటే వైరస్‌ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతోందో అర్థం చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మూడో వంతు కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,01,141 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు వాణిజ్య రాజధాని ముంబైని వణికిస్తున్నాయి. నగరంలో మొత్తంగా 55,451 కేసులు నమోదు కావడం కలవరపెట్టే అంశం. ముంబై తర్వాత థానేలో 16,443 కేసులు, పుణేలో 11,281 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3,717 మంది ప్రాణాలు కోల్పోతే ముంబైలో మృతుల సంఖ్య 2,044గా ఉంది.

3 వేల కంటైన్‌మెంట్‌ జోన్లు
మహారాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. ఒకే ప్రాంతంలో వరసగా 28 రోజులు కొత్త కేసులు నమోదు అవకపోతే ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌ నుంచి మినహాయిస్తారు. ముంబైలో 4,500 భవనాల్లో కరోనా కేసులు బయట పడడంతో అక్కడ్నుంచి రాకపోకలు నిలిపివేశారు. బెడ్స్‌ లేక ఒకే మంచంపై ఇద్దరు రోగుల్ని ఉంచి చికిత్స అందిస్తున్నారు. న్యూయార్క్‌ కంటే ప్రమాదకరమైన స్థితిలోకి ముంబై వెళ్లిపోతోంది. వెంటిలేటర్‌ కావాలంటే 2 గంటలు కంటే ఎక్కువ సేపు వేచి చూడాల్సి వస్తోందని స్వయంగా ఆస్పత్రి వైద్యులే చెబుతున్నారు.

ఎందుకిన్ని కేసులు ?
► 11,6 కోట్ల మంది జనాభా ఉన్న మహారాష్ట్రలో ప్రతీ చదరపు కిలోమీటర్‌కి 370 మంది నివసిస్తారు. ముంబై నగరంలో 42 శాతం జనాభా మురికివాడల్లోనే ఉంటారు. వీరే కరోనా వ్యాప్తికి క్యారియర్స్‌గా మారారు.

► లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు విధుల్లోకి వచ్చారు. దుకాణాలన్నీ తెరవడంతో జనం రోడ్లపై భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు.

► లాక్‌డౌన్‌ సమయాన్ని ఆరోగ్య రంగంలో సదుపాయాలు పెంచుకోవడానికి వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.

► రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండడంతో కరోనా కట్టడి చర్యల్లో పార్టీల మధ్య సమన్వయం కొరవడింది.. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకి పాలనా అనుభవం లేకపోవడంతో కేసుల కట్టడికి క్రమబద్ధమైన ప్రణాళిక రూపొందించలేకపోయారు.

నియంత్రణలో ఉంది: రాజేశ్‌ తోపే
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు రెండు రోజుల ముందే అంటే మార్చి 23 నుంచే మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుంది. అప్పటికి రాష్ట్రంలో 97 కేసులు మాత్రమే ఉండేవి. అయితే మహారాష్ట్ర జనాభా, జనసాంద్రతతో పోల్చి చూస్తే కేసుల్ని బాగా నియంత్రించామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే అంటున్నారు. వైరస్‌ను నియంత్రించడానికి తొలిదశలో లాక్‌డౌన్‌ సాయపడిందన్నారు. అమెరికా, యూరప్‌ దేశాలతో పోల్చి చూస్తే మహారాష్ట్ర పరిస్థితి అంత ఘోరంగా లేదని రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 47.34% ఉంటే, మరణాల రేటు 3.7%గా ఉంది.
 

మరిన్ని వార్తలు