ఆ రైలు ఇకపై ఇక్కడ ఆగదు: సీఎం

18 May, 2020 09:52 IST|Sakshi

గోవాలో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు..!

పనాజి: రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వలస కార్మికుల తరలింపు ప్రక్రియలో భాగంగా గోవా మీదుగా వెళ్తున్న ఢిల్లీ- తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఇకపై రాష్ట్రంలో ఆగదని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం గోవాలో 18 మంది కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చే వారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. వారు ఇతర ప్రజలతో మమేకం కాకముందే జాగ్రత్త చర్యలు పాటిస్తున్నాం. అయితే ఢిల్లీ రాజధాని రైలులో ప్రయాణించిన వాళ్లలోనే ఎక్కువ మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో సోమవారం నుంచి ఆ రైలును మడగావ్‌ స్టేషనులో ఆపవద్దని నిర్ణయించుకున్నాం’’ అని తెలిపారు.(ఎంజాయ్‌ చేసేందుకు ఇక్కడకు రావొద్దు: గోవా సీఎం)

కాగా తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్లే నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రం గోవాలో ఆపేందుకు సమ్మతంగా ఉన్నట్లు ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు. సదరు రైలులో ప్రయాణించిన వారిలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని... అలాగే ఆ రైలు నుంచి అతికొద్ది మాత్రమే గోవాలో దిగారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రెడ్‌ జోన్ల నుంచి రాష్ట్రంలో ప్రవేశించే ట్రక్కు డ్రైవర్లకు తప్పనిసరిగా కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఇక మే 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి, హెచ్‌ఎస్‌సీ పరీక్షలను వాయిదా వేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.(స్వతంత్ర దర్యాప్తు: భారత్‌ సహా 62 దేశాల మద్దతు!)

కాగా సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నప్పటికీ మహమ్మారిని కట్టడి చేయడంలో గోవా ప్రభుత్వం విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు నెల రోజులుగా అక్కడ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. అయితే లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో బయటి ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి రాకపోకలు సాగుతుండటంతో తాజాగా కేసుల సంఖ్య 18కి చేరింది. దీంతో ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ మరోసారి కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సమాయత్తవుతున్నారు. ఇక గోవాలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ కేసులు నమోదు కాలేదు. (ఇది మోదీ చేసిన మూడో తప్పు : గగోయ్‌)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు