681కి చేరిన కరోనా మృతుల సంఖ్య

23 Apr, 2020 09:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 21 వేలు దాటిపోయాయి. ఇప్పటివరకు  21,393 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 681 మంది మృతి చెందగా.. 4,257 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే అత్యధిక పాజిటివ్‌ కేసులతో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,710 చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకూ 269మంది చనిపోయారు. గత 24 గంట‌ల్లో 18 మంది వైరస్ బారినపడి మరణించగా, వారిలో పదిమంది ముంబైకి చెందినవారే ఉన్నారు. అలాగే 789మంది కోలుకున్నారు. ఇక కరోనా కేసులతో గుజరాత్‌ రెండు, ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 26లక్షల మంది కరోనా మహమ్మారి బారిన పడగా, లక్షా, ఎనభైమూడు లక్షల మంది మృత్యువాత పడ్డారు. (27 సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్)

ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర
కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బంది రక్షణ నిమిత్తం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు  కేంద్ర కేబినెట్‌ నిన్న (బుధవారం) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ ఆర్డినెన్స్‌ను కేంద్రం రాష్ట్రపతికి పంపగా, ఆయన వెంటనే ఆర్డినెన్స్‌కు ఆమోద​ ముద్రవేసి, గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీంతో ఈ ఆర్డినెన్స్‌ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. మామూలు దాడులకు మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుంది. ఒకవేళ దాడి తీవ్రస్థాయిలో జరిగి, బాధిత వైద్య సిబ్బందికి గాయాలు తీవ్రంగా ఉంటే.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుంది. (కరోనా: నోట్లను ముట్టుకుంటే ఒట్టు)

మరిన్ని వార్తలు