డాక్టర్లకు ఇళ్లు కరువు.. కేంద్రం ఆగ్రహం!

25 Mar, 2020 12:27 IST|Sakshi

న్యూఢిల్లీ: వైద్య సిబ్బంది పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న ఇళ్ల యజమానులపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ స్టాఫ్‌కు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈమేరకు జిల్లా మెజిస్ట్రేట్‌,  జోనల్‌ డిప్యూటీ కమిషనర్‌, డీసీపీలకు విస్తృత అధికారాలు కల్పిస్తున్నట్టు కేంద్రం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాగా, కరోనా పేషంట్లకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి వైరస్‌ సోకుందనే భయాల నేపథ్యంలో.. ఢిల్లీలోని కొందరు ఇంటి యజమానులు వాళ్లను ఖాళీ చేయించారు. దీంతో ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు విషయాన్ని హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు.
(చదవండి: కరోనా వైరస్‌: ఎందుకంత ప్రమాదకారి?)

ఇంటి యజమానుల దౌర్జన్యంతో తమ సహోద్యోగులకు నివాసాలు కరువయ్యాయని రెసిడెంట్‌ డాక్టర్ల అసోషియేషన్‌ ఆయనకు లేఖ రాసింది. దీంతో స్పందించిన హోంమంత్రి  వైద్యులను అడ్డుకోవడం ద్వారా ఇళ్ల యజమానులు ఘోరమైన తప్పు చేస్తున్నారని మండిపడ్డారు. అత్యవసర సేవల్ని అడ్డుకుంటున్న వారు ఢిల్లీ అంటు వ్యాధుల నియంత్రణ చట్టం, కోవిడ్‌-19 నిబంధనల ప్రకారం శిక్షార్హలవుతారని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇల్లు ఖాళీ చేయాలని వేధిస్తున్నవారిపై కేసులు నమోదు చేయాలని పేర్కొంది. రోజూవారి తీసుకున్న చర్యల్ని వెల్లడించాలని ఢిల్లీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ విషయంపై  కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ మాట్లాడుతూ వైద్య సిబ్బందిపై ఇంటి యజమానుల దౌర్జన్యాలు ఆవేదన కలిగించాయన్నారు. దేశమంతా వారి సేవలకు మద్దతునిస్తూ.. చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపితే.. ఇంత క్రూరంగా ఎలా ఆలోచిస్తారని ఆయన ప్రశ్నించారు.
(చదవండి: అమ్మను సర్‌ప్రైజ్‌ చేస్తానని.. అనంత లోకాలకు)

మరిన్ని వార్తలు