ఒకటీ రెండు కేసులకే మూసేయొద్దు

19 May, 2020 04:48 IST|Sakshi

భారీగా కేసులొస్తేనే ఆఫీస్‌లు మూయండి

కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ: కంపెనీలు, సంస్థలు ఒకటీ రెండు కరోనా కేసులు బయటపడిన సందర్భాల్లో తమ కార్యాలయ భవనం లేదా పని ప్రాంతాన్ని మొత్తాన్ని మూసివేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.  భవనాన్ని శానిటైజ్‌ చేసి కార్యకలాపాలను ప్రారంభించవచ్చని తెలిపింది. భారీగా కేసులు నిర్ధారణ అయితే ఆ భవనాన్ని 48 గంటలపాటు మూసి ఉంచాలని సూచించింది. భవనాన్ని శానిటైజ్‌ చేసి, సురక్షితమని ధ్రువీకరించుకున్నాకే ప్రారంభించాలని, సిబ్బంది ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’విధానంలో పనిచేయాలని పేర్కొంది.

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. కార్యాలయ సిబ్బంది ఎవరైనా ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడే వారు ఆఫీసులకు రావద్దని, స్థానిక ఆరోగ్య శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరింది. ఒక గదిలో లేదా ఆఫీసు ప్రాంతంలో ఎవరైనా కోవిడ్‌–19 సోకిన లక్షణాలతో బాధపడుతుంటే వారిని మరో చోట ఒంటరిగా ఉంచి, వైద్యుని సలహా తీసుకోవాలని సూచించింది. అటువంటి వ్యక్తులు, కోవిడ్‌–19 అనుమానిత లేక పాజిటివ్‌ అని తేలితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది.  

‘50 శాతం జూనియర్‌ స్టాఫ్‌ విధులకు హాజరు కావాలి’
డిప్యూటీ సెక్రెటరీ కంటే తక్కువ స్థాయి పోస్టుల్లో ఉన్న జూనియర్‌ ఉద్యోగుల్లో 50 శాతం మంది కార్యాలయాల్లో విధులకు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పటిదాకా 33 శాతం మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ఇకపై జూనియర్‌ ఉద్యోగులు రోజు విడిచి రోజు ఆఫీసులకు వచ్చేలా అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు రోస్టర్‌ను రూపొందించాలని కేంద్రం ఆదేశించింది.

కోవిడ్‌ కారణంగా తీవ్రమైన హృద్రోగ సమ స్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రక్తం గడ్డకట్టడం లాంటి సమస్యలకు కోవిడ్‌ కారణమౌతోందని, కోవిడ్‌ మందుల వల్ల హృద్రోగులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని అమెరికాలోని వర్జీనియా వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు