కరోనా మృత్యుఘోష

7 Apr, 2020 04:40 IST|Sakshi
అహ్మదాబాద్‌లో క్రిమి సంహారిణులను వాహనం ద్వారా స్ప్రేచేస్తున్న సిబ్బంది

దేశంలో 111కి చేరిన మరణాలు 

24 గంటల్లో 28 మంది మృతి  

ఒకేరోజు 704 కొత్త కేసులు  

4,281కి చేరిన పాజిటివ్‌ కేసులు

న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారి కాటేస్తోంది. దేశంలో ఇప్పటిదాకా 111 మందిని బలి తీసుకుంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 704 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, 28 మంది మృతి చెందారని  కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏకంగా 4,281కి చేరింది. బాధితుల్లో ఇప్పటిదాకా 318 మంది స్వస్థత పొందారు. కరోనా వల్ల గత 24 గంటల్లో మహారాష్ట్రలో 21 మంది, ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు, తమిళనాడులో ఇద్దరు, పంజాబ్‌లో ఒకరు, గుజరాత్‌లో ఒకరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు మృత్యువాత పడ్డారు.

కరోనా మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 45 మంది బలయ్యారు. గుజరాత్‌లో 12 మంది, మధ్యప్రదేశ్‌లో 9 మంది, తెలంగాణలో ఏడుగురు, ఢిల్లీలో ఏడుగురు, పంజాబ్‌లో ఆరుగురు, తమిళనాడులో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు మరణించారు. ఇతర రాష్ట్రాల్లోన మరణాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రాల వారీగా గణాంకాలను బట్టి చూస్తే కరోనాతో దేశవ్యాప్తంగా 137 మంది కన్ను మూసినట్లు, 4,678 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా వెలుగుచూసిన 4,281 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 1,445 కేసులు తబ్లిగీ జమాత్‌కు సంబంధం ఉన్నవేనని గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.  

యువతలోనూ ముప్పు అధికమే..  
మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో పురుషుల వాటా 76 శాతం, మహిళల వాటా 24 శాతమని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ సోమవారం తెలిపారు. మొత్తం కేసుల్లో 40 ఏళ్లలోపు వారి వాటా 47 శాతం, 40 నుంచి 60 ఏళ్లలోపు వారి వాటా 34 శాతం, 60 ఏళ్లకుపైగా వయసున్న వారు 19 శాతమని పేర్కొన్నారు.  మృతుల్లో పురుషులు 73 శాతం, మహిళలు 27 శాతమని చెప్పారు. మరణాల్లో 60 ఏళ్లలోపు వారు 63 శాతం,  40 నుంచి 60 ఏళ్లలోపు వారు 30 శాతం, 40 ఏళ్లలోపు వారు 7 శాతమని వెల్లడించారు.  

కరోనా 2–3 దశల మధ్య భారత్‌  
కొన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు  భారీగా నమోదవుతున్నాయని, దీన్నిబట్టి వైరస్‌ వ్యాప్తి విషయంలో దేశం రెండు, మూడు దశల మధ్య ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.. దేశంలో కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్‌ సామూహికంగా సంక్రమిస్తున్నట్లు తెలుస్తోందని ‘ఎయిమ్స్‌’ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా