ఇంటింటి సర్వే చేపట్టండి

9 Jun, 2020 04:43 IST|Sakshi

వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు చర్యలు తీసుకోండి

తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లోని 45 స్థానిక సంస్థలకు కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విస్తరిస్తున్న 10 రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో ఉన్న 45 స్థానిక సంస్థల అధికారులకు కేంద్ర ఆరోగ్య శాఖ పలు ఆదేశాలు జారీచేసింది. తమ పరిధిలోని పట్టణాలు, నగరాల్లో ఇంటింటి సర్వే నిర్వహించడంపై దృష్టి పెట్టాలని, అవసరమైన అందరికీ పరీక్షలు నిర్వహించి, వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలని ఆదేశించింది.

తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్తాన్, హరియాణా, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్నాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌ల్లోని ఆ 45 మున్సిపల్‌ కార్పొరేషన్లకు సంబంధించిన కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లు, మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ నిబంధనల  సడలింపు నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాలవారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.

జన సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంపై, కంటెయిన్‌మెంట్‌ వ్యూహాలపై కూడా ఆ సమావేశంలో చర్చించారు. కరోనా మరణాల రేటును తగ్గించేందుకు వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పేషెంట్లలో లక్షణాలు ఉధృతమై, పరిస్థితి చేయి దాటకముందే చికిత్స అందేలా చూడాలన్నారు. ఆసుపత్రులు, వైద్యుల నిర్వహణ కోసం సమర్థ విధానాలను అమలు చేయాలని, ఆసుపత్రులకు వచ్చే అనుమానిత పేషెంట్ల కోసం ప్రత్యేకంగా అధికారులను ఆసుపత్రుల్లో నియమించాలని సూచించారు. స్థానిక సంస్థలు అన్ని ప్రభుత్వ సంస్థలను సమన్వయం చేసుకుని వైరస్‌ను కట్టడి చేసేందుకు కృషి చేయాలనీ, అంబులెన్స్‌లను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను అందుబాటులో ఉంచాలని సూచించింది.

ఒక్కరోజులోనే 9,983 కేసులు

 24 గంటల్లో 271 మంది మృతి
ఇప్పటిదాకా 2,56,611 కేసులు.. 7,200 మరణాలు  

ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కేసులు రెండున్నర లక్షలు, మరణాలు ఏడు వేల మార్కును దాటేశాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల్లోనే 9,983 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే తొలిసారి. తాజాగా 271 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 2,56,611కు, మరణాలు 7,200కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కరోనా కేసులు 1,24,981 కాగా, 1,24,429 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 48.49 శాతంగా నమోదైంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటివరకు 47,74,434 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. గత 24 గంటల్లో 1,08,048 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కరోనా ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే తర్వాత స్థానం ఇండియాదే.

మరిన్ని వార్తలు