ఒక్కరోజులో... 505 కేసులు, 7 మరణాలు

6 Apr, 2020 04:16 IST|Sakshi
ఆదివారం ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ వద్ద ఫోరెన్సిక్‌ నిపుణులు

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి 

83కు చేరిన మరణాల సంఖ్య   కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 505 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఏడుగురు మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,577, మొత్తం మరణాల సంఖ్య 83కి చేరిందని వెల్లడించింది. కానీ, రాష్ట్రాల వారీగా గణాంకాలు చూస్తే కరోనా వల్ల దేశవ్యాప్తంగా 110 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,959కు చేరినట్లు స్పష్టమవుతోంది. వీరిలో 306 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆరోగ్యవంతులుగా మారి, ఇళ్లకు చేరారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల గణాంకాలను మదింపు చేయడంలో జరుగుతున్న జాప్యం వల్లే లెక్కల్లో వ్యత్యాసం కనిపిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.  

4.1 రోజుల్లో కేసులు రెట్టింపు  
దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపు కావడానికి ప్రస్తుతం 4.1 రోజులు పడుతోంది. ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌కు సంబంధించిన కేసులు గనుక లేకపోయినట్లయితే, ఇందుకు 7.4 రోజులు పట్టేదని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రెటరీ లవ్‌ అగర్వాల్‌ ఆదివారం తెలిపారు. దేశంలో 274 జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయని పేర్కొన్నారు. కరోనా విషయంలో తాజా పరిస్థితిపై కేంద్ర కేబినెట్‌ సెక్రెటరీ రాజీవ్‌ గౌబా ఆదివారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులు, జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు, ఎస్పీలతో చర్చించారని వివరించారు. కరోనా నేపథ్యంలో ఆధునిక రక్షణ పరికరాలను రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.   

అగ్రస్థానంలో మహారాష్ట్ర
మృతుల విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్‌ కేసుల్లో ఢిల్లీ మొదటిస్థానం. ఇక్కడ 503 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని భారత వైద్య పరిశోధనా మండలి స్పష్టం చేసింది.  

ఢిల్లీలో 8 మంది మలేషియన్ల పట్టివేత   
ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లిగీ జమాత్‌కు హాజరై, సొంత దేశం మలేషియాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించిన 8 మంది మలేషియన్లను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఇండియాలో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను సొంత దేశానికి తీసుకెళ్లడానికి మలేషియన్‌ హైకమిషన్‌ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ విమానం ఆదివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరింది. అయితే, తబ్లిగీ జమాత్‌కు హాజరైనవారు కూడా ఈ విమానంలో మలేషియాకు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఇప్పటిదాకా ఢిల్లీలోనే తలదాచుకున్నారు.

వ్యక్తిగత రక్షణ పరికరాలు అందరికీ అక్కర్లేదు
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌
కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు, ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలందించేవారు మినహా ఇతరులు పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌(పీపీఈ) ఉపయోగించా ల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. ఆయన ఆదివారం హరియాణా రాష్ట్రం ఝాజర్‌లోని ఎయిమ్స్‌లోని కరోనా చికిత్సా కేంద్రాన్ని సందర్శించారు.

మరిన్ని వార్తలు