24 గంటల్లో 1035 కేసులు

12 Apr, 2020 04:34 IST|Sakshi
మహారాష్ట్రలోని కరాడ్‌లో కోవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్న వైద్య సిబ్బంది

రికార్డు స్థాయిలో నమోదైన కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు 

మహమ్మారి కాటుకు ఒకే రోజు 40 మంది కన్నుమూత

మొత్తం మరణాలు: 242.. మొత్తం కేసులు: 7,529

న్యూఢిల్లీ:   దేశంలో కరోనా ప్రకోపానికి జనం బలవుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో ఏకంగా 1,035 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా కాటుతో తాజాగా 40 మంది కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య 242కు, పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,529కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. యాక్టివ్‌ కరోనా కేసులు 6,634 కాగా, 652 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే..కరోనా దేశవ్యాప్తంగా 261 మంది మృతి చెందినట్లు. 8,016 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు స్పష్టమవుతోంది.  

నియంత్రణ చర్యలు లేకుంటే..  
కరోనా కట్టడికి ప్రభుత్వం ముందుగానే చర్యలు ప్రారంభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియాతో అన్నారు. లాక్‌డౌన్, ఇతర నియంత్రణ చర్యలు చేపట్టకపోతే కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 2.08 లక్షలకు, ఈనెల 15 నాటికి ఏకంగా 8.2 లక్షలకు చేరేదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కేసుల సంఖ్య ఇప్పటిదాకా 7,447కే పరిమితమైందన్నారు.

586 ఆసుపత్రుల్లో వైద్య సేవలు   
దేశవ్యాప్తంగా 586 ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఈ హాస్పిటళ్లలో లక్షకుపైగా ఐసోలేషన్‌ పడకలు, 11,836 ఐసీయూ పడకలను  కేటాయించినట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కొరత లేదని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీ స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌(డీఎస్‌సీఐ)లో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఆసుపత్రిలో ఒక డాక్టర్, 9 మంది పారామెడికల్‌ సిబ్బందితోపాటు 11 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు, ఇతర రోగులను సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేర్చారు. మొత్తం ఆసుపత్రిని శానిటైజ్‌ చేశారు. దేశంలో 80 శాతం కరోనా పాజిటివ్‌ కేసులు 17 రాష్ట్రాల్లోని 71 జిల్లాల్లోనే నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ కట్టడిలో కువైట్‌కు భారత్‌ అన్ని విధాలా సహకారం అందిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైన కేంద్రమంత్రులు సోమవారం నుంచి  విధుల్లో చేరనున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు వారు విధులు పున:ప్రారంభించనున్నారు.

వైద్య బృందంపై దాడి  
కరోనా వైరస్‌ లక్షణాలున్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు దుండగులు వైద్య సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీరట్‌లో జరిగింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న ఓ ఇమామ్‌తో సహా నలుగురిని అరెస్టు చేసి, జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు.

తబ్లిగీల ఆచూకీ చెప్తే 5,000 రివార్డు  
తబ్లిగీ జమాత్‌ సభ్యుల ఆచూకీ కనిపెట్టడంలో సహకరించిన వారికి రివార్డు ఇస్తామని ఉత్తరప్రదేశ్‌ పోలీసు శాఖ ప్రకటించింది. గత నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మత సమ్మేళనంలో పాల్గొని, తిరిగి వచ్చిన వారిలో కొందరు ఇప్పటికీ ఆజ్ఞాతంలోనే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. వీరి ఆచూకీ చెప్పినవారికి రూ.5,000 రివార్డు అందజేస్తామని తాజాగా ప్రకటించారు.  

మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ 30దాకా  
లాక్‌డౌన్‌ను 30వ తేదీ వరకు కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫెరెన్స్‌ అనంతరం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఏప్రిల్‌ 14 తరువాత కొన్ని ప్రాంతాల్లో ఆంక్షల సడలింపు ఉంటుందని, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరింత కఠిన ఆంక్షలు ఉంటాయన్నారు. కర్ణాటకలో కూడా లాక్‌డౌన్‌ మరో రెండు వారాలు కొనసాగుతుందని,  సంబంధిత విధివిధానాలను కేంద్రం ప్రకటిస్తుందని సీఎం యడ్యూరప్ప శనివారం చెప్పారు. 

మరిన్ని వార్తలు