‘లాక్‌డౌన్‌’తో సత్ఫలితాలు

24 Apr, 2020 03:45 IST|Sakshi
చెన్నైలో కరోనా డిజైన్‌లో ఆటో

వైరస్‌ వ్యాప్తిని తగ్గించగలిగాం

3,773 కోవిడ్‌ ఆస్పత్రులు

కేంద్ర సాధికార బృందం–2  చైర్మన్‌ మిశ్రా

న్యూఢిల్లీ: 30 రోజుల లాక్‌డౌన్‌ కాలంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని గణనీయంగా తగ్గించగలిగామని, కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే సమయాన్ని పెంచగలిగామని కేంద్రం తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను  భారీగా పెంచగలిగామని పేర్కొంది. లాక్‌డౌన్‌ సమయంలో గొంతు, ముక్కులో నుంచి సేకరించిన నమూనాల ద్వారా జరిపే ‘ఆర్‌టీ–పీసీఆర్‌’ పరీక్షా విధానాన్ని ఒక కీలక ఆయుధంగా ఉపయోగించామని కేంద్ర సాధికార బృందం–2 చైర్మన్‌ మిశ్రా చెప్పారు. ‘ఏప్రిల్‌ 22 నాటికి 5 లక్షలకు పైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం’ అన్నారు. భారత్‌లో వైరస్‌ వ్యాప్తి భారీగా లేదని, ఆ గ్రాఫ్‌లో పెరుగుదల నిలకడగానే ఉందని పేర్కొన్నారు. అంటే, భారత్‌ చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లే భావించాలని ఆయన వ్యాఖ్యానించారు.

‘అమెరికాలో మార్చి 26 నాటికి 5 లక్షల పరీక్షలు జరపగా, అందులో 80 వేలు పాజిటివ్‌గా తేలాయి.  భారత్‌లో ఏప్రిల్‌ 22 నాటికి 5 లక్షల పరీక్షలు జరపగా.. దాదాపు 20 వేల కేసులే నమోదయ్యాయి’ అని మిశ్రా వివరించారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి కొత్త కేసుల సంఖ్య 16 రెట్లు పెరగగా, నిర్ధారణ పరీక్షల సామర్ధ్యం 24 రెట్లు పెరిగిందని వివరించారు. ఇప్పటివరకు 3,773 కోవిడ్‌–19 ప్రత్యేక ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయని, వాటిలో 1.94 లక్షల ఐసొలేషన్‌ బెడ్స్, 24,644 ఐసీయూ బెడ్స్, 12,371 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని మిశ్రా తెలిపారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన సమయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపే ల్యాబ్స్‌ దేశంలో 100 మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 325కి చేరిందని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవతెలిపారు.  

14 రోజుల్లో 78 జిల్లాల్లో జీరో పాజిటివ్‌
14 రోజుల్లో దేశవ్యాప్తంగా 78 జిల్లాల్లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. గత 28 రోజుల్లో 12 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. కోలుకున్నవారి శాతం పదిరోజుల క్రితం 9.9గా ఉండగా, ఇప్పుడు 19.89కి చేరుకుందన్నారు. కాగా, పారిశ్రామిక వర్గాల నుంచి వారి సమస్యలపై సమాచారం తీసుకుని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ పుణ్య సలిల శ్రీవాస్తవ తెలిపారు. మనిహాయింపులతో పాటు కొత్తగా ప్రకటించిన కొన్ని నిబంధనలు పాటించడం ఆచరణసాధ్యంగా లేవని పలువురు పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు చెప్పారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాల్లో మెరుగుదల కనిపిస్తోందన్నారు.

21,700 కేసులు.. 686 మరణాలు
దేశవ్యాప్తంగా ఒక్కరోజులో కొత్తగా 1,229 కేసులు, 34 మరణాలు
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గురువారానికి 21,700కి పెరిగింది. కోవిడ్‌ కారణంగా చనిపోయినవారి సంఖ్య 686కి చేరింది. బుధవారం సాయంత్రం నుంచి 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,229 కేసులు, 34 మరణాలు సంభవించాయి. మొత్తం 21,700 కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 16,689 అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 4,324 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. ఇలా కోలుకున్నవారి శాతం 19.93 అని వివరించింది. బుధవారం నుంచి చోటు చేసుకున్న మరణాల్లో అత్యధికం మహారాష్ట్రలో సంభవించాయి. ఆ రాష్ట్రంలో 18 మంది, గుజరాత్‌లో 8 మంది మరణించారు. మొత్తం 686 మరణాల్లోనూ మహారాష్ట్రలో అత్యధికం చోటు చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు