రెండు లక్షలకు చేరువలో..

2 Jun, 2020 04:37 IST|Sakshi

మరో 8,392 మందికి కరోనా

ఒక్క రోజులోనే 230 మృతి

దేశంలో కోవిడ్‌–19 మహమ్మారితో ఇప్పటివరకు 5,394 మంది మృతి చెందగా కేసుల సంఖ్య 1,90,535కు చేరుకుంది. రికార్డు స్థాయిలో ఒక్క రోజు వ్యవధిలోనే కోవిడ్‌–19తో 230 మంది మరణించగా 8,392 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది.

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌–19 మహమ్మారితో ఇప్పటివరకు 5,394 మంది మృతి చెందగా కేసుల సంఖ్య 1,90,535కు చేరుకుంది. రికార్డు స్థాయిలో ఒక్క రోజు వ్యవధిలోనే కోవిడ్‌–19తో 230 మంది మరణించగా 8,392 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్‌ ఇటలీల తర్వాత ఏడో స్థానంలోకి భారత్‌ చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాలు చెబుతున్నాయి. 91,818 మంది వైరస్‌ బాధితులు కోలుకుని డిశ్చార్జి కావడంతో రికవరీ రేటు 48.19 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  

తీవ్రమైన సామాజిక వ్యాప్తి దశలో భారత్‌
దేశంలో కోవిడ్‌–19 వ్యాధి తీవ్రమైన సామాజిక వ్యాప్తి దశకు చేరిందని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వైద్య నిపుణులు, ఐసీఎంఆర్‌ కోవిడ్‌ –19 అధ్యయన బృందం సభ్యులు వెల్లడించారు. దేశంలో 1.90 లక్షల మందికి కోవిడ్‌ సోకి, 5వేల మంది మరణించినప్పటికీ దేశంలో ఇంకా సామాజిక వ్యాప్తి జరగలేదనడంలో అర్థం లేదని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే తీవ్రంగా కోవిడ్‌ బారిన పడిన దేశాల్లో భారత్‌ ఏడవ స్థానాన్ని ఆక్రమించింది. ఇంత విస్తృతంగా కోవిడ్‌–19 సామాజిక వ్యాప్తి జరిగిన దశలో, వైరస్‌ను అరికడతామని చెప్పడం అవాస్తవమైన విషయమని ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ అసోసియేషన్‌ (ఐపీహెచ్‌ఏ), ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌ (ఐఏపీఎస్‌ఎం), ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఎపిడమాలజిస్ట్స్‌ సభ్యులు ప్రధాని మోదీకి సమర్పించిన నివేదికలో వెల్లడించారు.

మరిన్ని వార్తలు