30% కేసులకు మర్కజ్‌ లింక్‌

19 Apr, 2020 03:02 IST|Sakshi
మహారాష్ట్రలోని కరాడ్‌లో వాహన ఉల్లంఘనదారుల నుంచి జరిమానాగా వసూలు చేసిన నోట్లను శానిటైజ్‌ చేస్తున్న పోలీసు

తెలంగాణలో 79%, ఏపీలో 61% కేసులకు సంబంధం

కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

కరోనా మరణాలు 488.. పాజిటివ్‌ కేసులు 14,792

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు నమోదైన 14,792 కరోనా పాజిటివ్‌ కేసుల్లో మర్కజ్‌ ఘటనతో సంబంధమున్నవే 4 వేల పైచిలుకు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇలాంటి కేసులున్నట్లు పేర్కొంది. కోవిడ్‌ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌  వివరించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మార్చిలో జరిగిన మత పరమైన కార్యక్రమంతో సంబంధమున్న 4,291 కేసుల్లో అత్యధికంగా తమిళనాడు(84%), తెలంగాణ (79%), ఢిల్లీ(63%), ఉత్తరప్రదేశ్‌(59%), ఆంధ్రప్రదేశ్‌(61%)ల్లోనే ఉన్నాయని వివరించారు. మొత్తం కేసుల్లో ఇవి 29.8% వరకు ఉన్నట్లు తెలిపారు. తక్కువ సంఖ్యలో నమోదైన రాష్ట్రాల్లోనూ మర్కజ్‌ ఘటనతో లింకులున్న కేసులున్నాయన్నారు.

అస్సాంలో నమోదైన 35 కేసుల్లో 32, అండమాన్‌ దీవుల్లోని 12 కేసుల్లో 10 ఈ కార్యక్రమంతో సంబంధమున్నట్లు తేలిందని చెప్పారు. ఇక గడిచిన 14 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదుకాని 47 జిల్లాల్లో ఏపీలోని విశాఖపట్టణం ఉంది. కరోనాతో మరణించిన వారి సంఖ్య శనివారానికి 488కి, పాజిటివ్‌ కేసులు 14,792కి చేరుకున్నాయి. దేశం మొత్తమ్మీద యాక్టివ్‌ కేసులు 11,906 కాగా 1,992 మంది ఇప్పటి వరకు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.  గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు కొత్తగా 991 నమోదు కాగా, 43 మంది మరణించారని ఆరోగ్య శాఖ పేర్కొంది. వీరిలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 12 మంది మృతి చెందారు. ఆ తర్వాత మహారాష్ట్రలో ఏడుగురు, ఢిల్లీలో నలుగురు, గుజరాత్‌లో ముగ్గురు, జమ్మూకశ్మీర్, బిహార్‌లలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు తెలిపింది.  

మరణాల రేటు 3.3 శాతం
దేశంలో కోవిడ్‌ మరణాల రేటు 3.3%గా ఉందని లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఇందులో 0–45 ఏళ్ల గ్రూపులో 14.4%, 45–60 ఏళ్ల వారు 10.3%, 60–75 ఏళ్ల వారు 33.1%, 75 ఆపైన వయస్సు వారిలో 42.2% అని తెలిపారు. మొత్తంగా కోవిడ్‌తో మృతి చెందిన వారిలో 75.3% మంది 60 ఏళ్లు, ఆపై వారేనన్నారు. 83% మరణాలకు ఇతర ఆరోగ్య సమస్యలూ కారణం.

మహారాష్ట్రలో అత్యధికం
కరోనా సంబంధిత మరణాలు ఇప్పటిదాకా 488 కాగా, మహారాష్ట్రలో∙201 మరణాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌ (69), ఢిల్లీ (42), గుజరాత్‌ (48) ఉన్నాయి. తమిళనాడులో 15 మంది, పంజాబ్‌లో 13 మంది, ఉత్తరప్రదేశ్‌లో 14 మంది, కర్ణాటకలో 13 మంది చనిపోయారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 3,323 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఢిల్లీ (1,707), తమిళనాడు (1,323), మధ్యప్రదేశ్‌ (1,310) ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో 100 లోపే కరోనా కేసులు నమోదయ్యాయి.

► రాజస్తాన్‌లోని కోటాలో చిక్కుకుపోయిన 3 వేల మంది విద్యార్థులను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన 100 బస్సుల్లో వారి స్వస్థలాకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.
► కంటైన్‌మెంట్‌ ఏరియాగా ప్రకటించిన జహంగీర్‌పూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఢిల్లీ సీఎం తెలిపారు.
► రాష్ట్రంలోని 12 లక్షల మంది భవన నిర్మాణ నిర్మాణ కార్మికులకు రూ.2వేల చొప్పున అందజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  

అన్ని రాష్ట్రాల్లోనూ అత్యవసర సహాయ కేంద్రాలు
లాక్‌డౌన్‌ కారణంగా తలెత్తే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని జిల్లాల్లో అత్యవసర సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశాయని హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ శ్రీవాస్తవ తెలిపారు. హోం శాఖ ఏర్పాటు చేసిన 1930, 944 హెల్ప్‌లైన్‌ నంబర్లు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. గర్భిణులు, వృద్ధులు, ప్రత్యేక అంగవికలురకు అత్యవసర సేవలందించేందుకు 112 నంబర్‌ అందుబాటులో ఉందని, 112 మొబైల్‌ యాప్‌ ద్వారా ఫోన్‌ కాల్‌ లొకేషన్‌ గుర్తించవచ్చని వివరించారు.

లాక్‌డౌన్‌పై అమిత్‌ షా సమీక్ష
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్, అత్యవసర వస్తువుల అందుబాటుపై హోం మంత్రి అమిత్‌ షా శనివారం సమీక్ష జరిపారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు సాయపడేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.

మరిన్ని వార్తలు