కోవిడ్‌-19 : 60.73 శాతానికి చేరిన రికవరీ రేటు

3 Jul, 2020 19:15 IST|Sakshi

భారీ ఊరట

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నా మహమ్మారి బారినపడి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరట ఇస్తోంది. కోవిడ్‌-19 రోగుల రికవరీ రేటు శుక్రవారం 60.73 శాతానికి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌ నుంచి 20,033 మంది కోలుకోగా యాక్టివ్‌ కేసుల కంటే కోలుకున్న వారిసంఖ్య 1,50,000 అధికంగా ఉంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 3,79,891 మంది కరోనా నుంచి కోలుకోగా 2,27,439 యాక్టివ్‌ కేసులున్నాయి.

మరోవైపు కోవిడ్‌-19 శాంపిల్స్‌ పరీక్షల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,41,576 శాంపిల్స్‌ను పరీక్షించగా ఇప్పటివరకూ మొత్తం 92,97,749 శాంపిల్స్‌ను పరీక్షించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో రికార్డు స్ధాయిలో 20,903 తాజా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,25,439కు చేరింది. ఇక కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేబినెట్‌ కార్యదర్శి అధ్యక్షతన అత్యున్నత సమీక్షా సమావేశం నిర్వహించారు. చదవండి : పీపీఈ సూట్​లో డాక్టర్​ డాన్స్..

>
మరిన్ని వార్తలు