కరోనా: ఆందోళనకరంగా నిబంధనల సడలింపు!

8 Apr, 2020 16:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లింగ నిర్ధారణ పరీక్షల నిబంధనలపై సడలింపు

అబార్షన్ల సంఖ్య పెరిగే అవకాశం

కేంద్ర మంత్రికి లేఖ రాసిన బృందా కారత్‌

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌ విస్తరిస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ విధించిన వేళ గృహహింస కేసులు రెట్టింపు కావడం ఆందోళనకరంగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా సొంత ఇంట్లోనే హింసకు గురవుతున్న మహిళల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మరో ఆందోళనకర వార్త సామాజిక కార్యరక్తలు, మానవ హక్కుల సంఘాలను కలవరపెడుతోంది. అంటువ్యాధి ప్రబలుతున్న తరుణంలో లింగ నిర్ధారణ పరీక్షలపై ఉన్న నిబంధనలను సడలిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టెలిగ్రాఫ్‌ పేర్కొంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య సేవలను విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు జూన్‌ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని వెల్లడించింది.

ప్రీనాటల్‌ డయాగ్నటిక్‌ టెక్నిక్స్‌(గర్భస్థ శిశువు నిర్ధారణ- లింగ ఎంపికపై నిషేధం) నిబంధనలు-1996 ప్రకారం.. ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ నిర్వహించే క్లినిక్‌లు అన్నీ.. తమ వద్ద పరీక్షలు చేయించుకున్న గర్భవతుల జాబితా స్థానిక ఆరోగ్య అధికారులకు సమర్పించాలి. ప్రస్తుతం కరోనా పేషెంట్లతో ఆస్పత్రులు నిండిపోయిన కారణంగా.. వారికి మెరుగైన చికిత్సలు అందించే క్రమంలో ఈ నిబంధనలు సడలిస్తూ ఏప్రిల్‌ 4న కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జూన్‌ 30 వరకు ఎటువంటి రికార్డులు నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు టెలిగ్రాఫ్‌ కథనం ప్రచురించింది.(లాక్‌డౌన్‌: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు!)

కాగా 2018 గణాంకాల ప్రకారం భారత్‌లో దాదాపు 63 మిలియన్‌ మంది ఆడవాళ్లు ఉన్నారు. ఇక లాన్సెట్‌ అధ్యయనం ప్రకారం లింగ వివక్ష కారణంగా 2000-2005 మధ్య కాలంలో భారత్‌లో ఐదేళ్ల లోపు వయస్సున్న 239000 మంది బాలికలు మరణించారు. 2017 అధ్యయనం ప్రకారం 2015లో 15.6 మిలియన్‌ అబార్షన్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం నిబంధనలు సడలించిన కారణంగా గర్భంలో ఆడ శిశువులు ఉన్నారని తెలిస్తే అబార్షన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. (గృహహింసకు ముగింపు పలకండి:యూఎన్‌ చీఫ్‌)

ఈ క్రమంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌ కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. అత్యవసర సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆస్పత్రి యాజమాన్యాలు, తల్లిదండ్రులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘నిబంధనలు సడలించిన కారణంగా జూన్‌ 30 వరకు క్లినిక్‌లు సమాచారం అందించాల్సిన అవసరం లేదు. కొంతమంది దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్చగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్‌-19 సృష్టించిన పరస్థితులను చట్ట వ్యతిరేక చర్యలకు వినియోగించే అవకాశం ఉంది’’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇక సీపీఎం-ఎల్‌ సభ్యురాలు, అఖిల భారత అభ్యుదయ మహిళా అసోసియేషన్‌ అధ్యక్షురాలు కవితా కృష్ణన్‌ కూడా ఈ విషయంపై ట్విటర్‌లో స్పందించారు.

మరిన్ని వార్తలు