కరోనా అలర్ట్‌: భక్తులెవరూ మా గుడికి రావొద్దు!

10 Mar, 2020 18:00 IST|Sakshi

తిరువనంతపురం: కరోనా భయాల నేపథ్యంలో కేరళలోని ప్రసిద్ధ శబరిమల దేవస్థానం బోర్డు భక్తులకు ఓ విజ్ఞప్తి చేసింది. నెలవారి పూజా కార్యక్రమాల సందర్భంగా మార్చి నెల ముగిసే వరకు భక్తులు ఆలయానికి రావొద్దని కోరింది. కోవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ బోర్డు ప్రెసిడెంట్‌ ఎన్‌.వాసు చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారం అయ్యప్ప స్వామికి పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. అయితే, ఎవరైనా తెలియక స్వామివారి దర్శనార్థం వస్తే.. వారిని ఆపే ప్రయత్నం చేయమని వాసు ‍స్పష్టం చేశారు.
(చదవండి: కరోనాపై విజయ్‌ దేవరకొండ అవగాహన కార్యక్రమం)

కాగా, రాష్ట్రంలో 12 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి ఆఖరు వరకు పాఠశాలకు సెలవు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు ప్రభుత్వ వేడుకలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మతపరమైన ఉత్సవాలు చేయొద్దని, పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకోవాలని కోరారు. ఇదిలాఉండగా..కరోనా ప్రభావం అధికంగా ఉన్న పతనంతిట్ట జిల్లాలో శబరిమల ఆలయం ఉండటం గమనార్హం. 12 కేసుల్లో 7 కేసులు ఈ జిల్లాలో నమోదైనవే.
(కరోనా ప్రకంపనలు: ఒక్క రోజులో 54 మరణాలు )

మరిన్ని వార్తలు