593 కేసులు.. 215 తీర్పులు

27 Apr, 2020 05:00 IST|Sakshi

లాక్‌డౌన్‌ సమయంలో సుప్రీంకోర్టు పనితీరు

న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సమయంలో సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 593 కేసులపై విచారణ చేపట్టి, 215 కేసుల్లో తీర్పులు వెలువరించింది. కోవిడ్‌–19 వ్యాప్తి భయంతో లాక్‌డౌన్‌ కంటే రెండు రోజులు ముందుగానే మార్చి 23వ తేదీ నుంచి సుప్రీంకోర్టు ప్రాంగణం మూతబడిన విషయం తెలిసిందే. మామూలు సమయాల్లో నెలలో సుమారు 3,500 కేసులను విచారించే అత్యున్నత న్యాయస్థానం ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా కేసులను స్వీకరిస్తోంది. మొత్తం 16 ధర్మాసనాలకు గాను ప్రస్తుతం రెండు నుంచి మూడు ధర్మాసనాలే పనిచేస్తున్నాయి. అవి కూడా అత్యవసర కేసుల విచారణను మాత్రమే చేపడుతున్నాయి. ఈ ధర్మాసనాలు మార్చి 23– ఏప్రిల్‌ 24 తేదీల మధ్య 17 పనిదినాల్లో 593 కేసులను విచారించాయని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఇందులో 84 రివ్యూ పిటిషన్లున్నాయని వివరించింది. వీడియో కాన్ఫరెన్సింగ్‌ సమయంలో  లాయర్ల ఆఫీసుల్లో మాత్రమే కనెక్టివిటీ సంబంధిత సమస్యలు కొన్ని తలెత్తాయని తెలిపింది. 2018–19 సంవత్సరంలో మొత్తం 34,653 కేసులపై విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు వార్షిక నివేదిక తెలిపింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు