కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్‌ పరిశోధన

9 May, 2020 03:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) దేశంలో కరోనా వ్యాప్తిని కనుగొనేందుకు పరిశోధన చేయనుంది. దీనిలో భాగంగా దేశంలోని 75 జిల్లాలను ఎంచుకొని అందులో కరోనా సోకినా ఎటువంటి లక్షణాలను చూపని వారిపై పరిశోధనలు చేయనుంది. దేశంలో కరోనా వ్యాప్తి కమ్యూనిటీ స్థాయిలో జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడనుంది. ఈ పరిశోధనలో రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్ల నుంచి జిల్లాలను ఎంచుకొని పరీక్షించనున్నారు. అందులో కరోనా సోకిన వారికి వారి శరీరంలోని యాంటీబాడీలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోనున్నారని ఐసీఎంఆర్‌ కు చెందిన అధికారి తెలిపారు. ఈ పరిశోధన ముందే జరపవలసి ఉన్నప్పటికీ, చైనా నుంచి వచ్చిన కిట్లు సరిగా పనిచేయకపోవడంతో ఆలస్యమైట్లు చెప్పారు. ఈ పరిశోధనను త్వరలో ప్రారంభించనున్నారు. అధిక జనాభా, ఎక్కువగా రాకపోకలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోనున్నారు. కరోనా వచ్చిన వారిలో 80 శాతం మంది లక్షణాలను చూపకపోతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు