కోవిడ్‌ యోధుడి భార్య దీనగాథ

3 Jun, 2020 13:09 IST|Sakshi

పుస్తెలు కుదువ పెట్టి భర్త అంత్యక్రియలు

హుబ్లీ : కోవిడ్‌-19తో ముందుండి పోరాడుతున్నయోధులపై ప్రభుత్వాలు ప్రశంసలు గుప్పిస్తున్నా మరణించిన తర్వాత సైతం వారికి ఎలాంటి ఊరట కనిపిస్తున్న దాఖలాలు లేవు. కోవిడ్‌-19 విధుల్లో పాల్గొంటూ మరణించిన అంబులెన్స్‌ డ్రైవర్‌ అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఆయన భార్య తన మంగళసూత్రాన్ని అమ్మి ఆ క్రతువును నిర్వహించిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. గదగ్‌ జిల్లా కొన్నూర్‌కు చెందిన అంబులెన్స్‌ డ్రైవర్‌ ఉమేష్‌ హదగలి రెండు నెలలుగా కోవిడ్‌-19 విధుల్లో అవిశ్రాంతంగా పనిచేస్తూ ఇటీవల గుండెపోటుతో మరణించారు.

భర్త అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఆయన భార్య జ్యోతి తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టాల్సిన దయనీయ పరిస్ధితి ఎదురైంది. ఇద్దరు పిల్లలు కలిగిన తమకు ఎలాంటి సాయం అందకపోవడంతో విసిగిన ఉమేష్‌ భార్య తమ దుస్థితిని వివరించే వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియోను చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప స్పందించారు. సీఎం ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉమేష్‌ మరణించడంతో సత్వరమే బీమా మొత్తాన్ని వచ్చేలా చూడటంతో పాటు పరిహారం అందచేస్తామని హామీ ఇచ్చారు. ఇక తనకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు పిల్లల విద్యకు అవసరమైన సాయం చేయాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు.

చదవండి : భౌతిక దూరం గోవింద..! మంత్రిపై విమర్శలు

మరిన్ని వార్తలు