బీఫ్పై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

20 Nov, 2015 11:25 IST|Sakshi
బీఫ్పై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

హరిద్వార్: గొడ్డుమాంసం, గోవధ చేసేవారిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవధ చేసేవారికి భారత్లో నివసించే హక్కులేదని హరీష్ రావత్ వ్యాఖ్యానించారు.

'గోవులను ఏ మతానికి చెందినవారు చంపినా సరే.. వాళ్లు భారత్కు అతిపెద్ద శత్రువు. అలాంటి వ్యక్తులకు దేశంలో నివసించే హక్కులేదు' అని ఓ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం అన్నారు. గోవులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గోవధ చేసేవారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. దేశంలో అసహనం పెరిగిపోతోందని నిరసన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలావుండగా, బీజేపీ పాలిత హరియాణ ముఖ్యమంత్రి  ఎమ్ ఎల్ ఖట్టర్ ఇటీవల బీఫ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు బీఫ్ తినడం మానేయాలని వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు