గోవధపై ఆరెస్సెస్‌ నేత సంచలన వ్యాఖ్యలు

24 Jul, 2018 11:52 IST|Sakshi
ఆరెస్సెస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ (పాత చిత్రం)

రాంచీ : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) కీలక నేత ఇంద్రేష్‌ కుమార్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లోకి భారత ఆర్మీ తమకు కావల్సినప్పుడు ప్రవేశిస్తుందని ఇటీవల పేర్కొన్న ఆయన.. తాజాగా రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన దారుణంపై స్పందించారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో జగ్రాన్‌ హిందూ మంచ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇంద్రేష్‌ మంగళవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆవును చంపాలని ఏ మతం బోధించద లేదన్నారు. ఎప్పుడైతే ఆవులను చంపడం (గోవధ) ఆపేస్తారో అప్పుడే దేశంలో కొనసాగుతోన్న మారణహోమానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని పేర్కొన్నారు. మూక దాడులు, హత్యలపై ఇంద్రేష్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

మీ ఇంట్లో వాళ్లపైగానీ, పక్కింటి వారిపైగానీ.. ఎవ్వరిపైనైనా సరే దాడులు అనేది హేయమైన చర్య. అయితే ఆవులను చంపాలని చెప్పే మతం ఏదైనా ఉంటే చెప్పండంటూ ఆయన ప్రశ్నించారు. ‘క్రైస్తవులు ఆవును గోమాతగా పిలుస్తారు. యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించడమే అందుకు కారణం. మక్కా-మదీనాలో ఆవులను చంపడంపై నిషేధం ఉందన్న విషయం తెలిసిందే. అందుకే ఎప్పుడైతే గోవధను నిషేధించి, పూర్తిస్థాయిలో పాటిస్తారో అప్పుడే మూకదాడులు, హత్యాకాండ, అనిశ్చితికి తావుండని’ఆరెస్సెస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. 

ఈ జూలై 17న అగ్నివేష్‌పై జరిగిన దాడిని ఇంద్రేష్‌ ఖండించారు. హిందువులకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారన్న కారణంగా జార్ఖండ్‌లోని పాకుర్‌లో అగ్నివేష్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతియడానికి యత్నించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆవులను చంపుతున్న కారణంగానే మెజార్టీ వర్గాల్లో అనిచ్చితి నెలకొని దాడులకు ప్రేరేపిస్తోందని, గోవధకు స్వస్తి చెబితే అంతా శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు