దళిత నేతకు మావోయిస్టు మకుటం?

29 Sep, 2017 01:20 IST|Sakshi

‘ఎర్ర’ దళపతిగా పిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ!

మావోయిస్టు పార్టీలో నాయకత్వ మార్పు ప్రచారం

ప్రత్యేక నిఘాతో గుర్తించిన పోలీసులు

దీనిపై పలు జాతీయ పత్రికల్లోనూ కథనాలు

కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి నుంచి తప్పుకోనున్న గణపతి

వయోభారం, అనారోగ్యమే కారణం

చిన్న వయసు, దళిత వర్గానికి చెందిన వారికి బాధ్యతలు అప్పగించాలన్న యోచన!

పిప్పిరి తిరుపతి పేరుపై చర్చ

పోలీసులకు లభించిన పలు కీలక పత్రాలు

సాక్షి, హైదరాబాద్‌ : మావోయిస్టు పార్టీ నాయకత్వం మారిపోతోందా?.. కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి ఆ హోదా నుంచి తప్పుకొని, ఇతరులకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారా..? ఈసారి దళిత వర్గానికి చెందిన వారికి పగ్గాలు అప్పగించాలని.. తద్వారా బలహీనవర్గాల్లోకి మరింతగా వెళ్లవచ్చని భావిస్తున్నారా? అన్నింటికన్నా ముఖ్యంగా కేంద్ర కమిటీలో చిన్న వయసు వారికి బాధ్యతలు ఇవ్వనున్నారా..?.. ఈ ప్రశ్నలన్నింటికీ మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, నిఘా వ్యవహారాల్లో నిమగ్నమైన పోలీసువర్గాలు, కొన్ని జాతీయ ఆంగ్ల పత్రికలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. కొంతకాలంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరగడంతో పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు చెందిన పలు కీలక పత్రాలు లభించాయి.

వాటిని విశ్లేషించగా మావోయిస్టు పార్టీలో నాయకత్వం మార్పు అంశం వెల్లడైనట్లు తెలిసింది. దీంతో మావోయిస్టు పార్టీలో రెండో స్థానంలో ఉన్న నంబాళ కేశవరావు అలియాస్‌ బసవరాజ్‌ను కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమించవచ్చని తొలుత ప్రచారం జరిగింది. కానీ, పార్టీలో ఇటీవలి పరిణామాలతోపాటు, దళితవర్గానికి చెందిన వారికి నాయకత్వం అప్పగించాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీకి పగ్గాలు అప్పగించనున్నట్లుగా పోలీసు వర్గాలు నిర్ధారించుకున్నట్లు తెలిసింది.

కేంద్ర కమిటీలో చిన్నవారు..
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న 19 మందిలో తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ అందరికన్నా వయసులో చిన్నవారు. దళిత వర్గానికి చెందిన ఆయన పార్టీ కేంద్ర కమిటీలో సీసీ మెంబర్‌గా ఉన్నారు. చదువుకునే రోజుల నుంచి తిరుపతి తన ప్రియ శిష్యుడు కావడంతో ఆయన వైపే గణపతి మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం దేశంలోని విప్లవ సంస్థలు మావోయిజాన్ని, అంబేడ్కరిజాన్ని కలిపి ఉద్యమం నిర్మించాలని మేధావులు సూచిస్తున్నారు. పలు సందర్భాల్లో విప్లవ సంస్థల్లోనూ అగ్రవర్ణాల పెత్తనం నడుస్తోందని పరోక్షంగా గణపతిని ఉదహరిస్తూ విమర్శలు కూడా వచ్చాయి. దాంతో మావోయిస్టు పార్టీలోని కేంద్ర కమిటీలో రిజర్వేషన్లు అమలు చేస్తూ మహిళలు, దళితులకు అవకాశమిచ్చారు. తాజాగా గణపతి తప్పుకోనుండటంతో అందరి దృష్టి దళితుడైన తిరుపతిపై పడింది.

తెరపైకి 2007 ప్లీనరీ అంశాలు..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పీపుల్స్‌వార్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొండపల్లి సీతారామయ్యను 1992లో తొలగించారు. అప్పటినుంచి గణపతి ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, 2004లో విప్లవ సంస్థలన్నీ కలసి ఏర్పాటైన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగు తున్నారు. ప్రస్తుతం ఆయనకు వయసు మీదపడటం, అనారోగ్యం కారణంగా కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2007లో మావోయిస్టు పార్టీ నిర్వహించుకున్న ప్లీనరీ సందర్భంగా నాయకత్వం వహించేవారి వయసు 60 ఏళ్ల వరకే ఉండాలన్న చర్చ జరిగిందని... ఇప్పుడా అంశాన్ని పరిగణనలోకి తీసుకుని గణపతి స్థానంలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి అప్పట్లో కేంద్ర కమిటీలో ఉన్న నంబాళ కేశవరావు, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఆజాద్‌ అలియాస్‌ చెరుకూరి రాజ్‌కుమార్, ప్రస్తుతం జైలులో ఉన్న కోబాడ్‌ గాంధీలలో ఒకరు కార్యదర్శిగా ఎంపికకా వొచ్చని ప్రచారం సాగింది. ఇక వీరితోపాటు పార్టీ కేంద్ర కమిటీలో కటకం సుదర్శన్, మల్లా రాజిరెడ్డి, వేణుగోపాల్‌రావు, అక్కిరాజు హరగోపాల్, మోడెం బాలకృష్ణ, ఒగ్గు సత్వాజీ, రావుల శ్రీనివాస్, పిప్పిరి తిరుపతి, జీనుగు నర్సింహారెడ్డిలతోపాటు బిహార్‌ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్, బిహార్‌ మావోయిస్టు పార్టీ యూనిట్‌ల నుంచి మరో పది మంది సీనియర్‌ నాయకులు ఉన్నారు. మొత్తంగా వీరందరూ 50 ఏళ్ల పైబడిన వారే. 12 మందికి 60 ఏళ్ల వయసు కూడా నిండింది.

మరో ‘కొండపల్లి’ కావొద్దని..
పీపుల్స్‌వార్‌ పార్టీ వ్యవస్థాపకుడైన కొండపల్లి సీతారామయ్య అనారోగ్యం, మతిమరుపుతో బాధపడటం, పార్టీలో పలు విభేదాలకు కారణంగా మారడంతో ఆయనను పార్టీ కార్యదర్శి పదవి నుంచి తప్పించే వరకూ వెళ్లింది. 1992లో పదవి నుంచి తొలగించాక పలు సందర్భాల్లో ఆయన పరిస్థితి, ఆయన బయటకు వెళ్లిన తీరుపై పార్టీలోని సీనియర్లు ఆందోళనకు గురయ్యారు. దాంతో వయసు పైబడిన నాయకులకు అత్యున్నత స్థానం కల్పిస్తూ.. యువతకే నాయకత్వ బాధ్యతలు అప్పగిం చాలని 2007 ప్లీనరీలో మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడా అంశం తెరపైకి రావడంతో నాయకత్వ మార్పుకు బీజం పడినట్లు తెలుస్తోంది.

రష్యాలో తప్పుకున్న లెనిన్‌.. చైనాలో కొనసాగిన మావో
మావోయిస్టు పార్టీలో కొండపల్లి సీతారామయ్య పరిణామం తర్వాత నాయకత్వం వయసుపై చర్చలు సాగాయి. వృద్ధులు పార్టీని ఏలుతున్నారని.. చైనాలో మావో చనిపోయే వరకు కార్యదర్శిగా పనిచేసి, విప్లవం విజయవంతమైన తర్వాత దేశాధ్యక్షుడిగా సుదీర్ఘకాలం ఉన్నారని వ్యాఖ్యానాలు వినిపించేవి. అటు రష్యాలో మాత్రం లెనిన్‌ అనారోగ్యానికి గురికావడంతో పార్టీ కార్యదర్శి పదవిని స్టాలిన్‌కు అప్పగించారు. ఆ దేశంలో విప్లవం విజయవంతం అయ్యేందుకు స్టాలిన్‌ సారథ్యం వహించారు. రష్యా, చైనాల విప్లవ ఉద్యమ స్ఫూర్తిగా భారత్‌లో మావోయిస్టు పార్టీని నడుపుతున్న గణపతి.. అనారోగ్యం కారణంగా లెనిన్‌ తరహాలో ఇతరులకు బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం సాగుతోంది. అయితే కార్యదర్శి బాధ్యతలు నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ రెడ్‌ ఆర్మీని నడుపుతూ, విదేశీ విప్లవ సంస్థలను సమన్వయపరుస్తూ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టు పార్టీకి నేతృత్వం వహించడం అసాధారణమైన విషయమని ఆ పార్టీకి చెందిన కొందరు మాజీలు పేర్కొంటున్నారు.

నంబాళ కేశవరావు పేరు కూడా..
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పార్టీ సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ చీఫ్‌ కమాండర్‌గా ఉన్న నంబాళ కేశవరావు అలియాస్‌ బసవరాజ్‌ను నియమించవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. రెండు నెలల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌లో నిర్వహించిన మావోయిస్టు ప్లీనరీలో ఈ దిశగా చర్చించినట్లు తెలిసిందని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలలుగా అరెస్టయిన మావోయిస్టుల విచారణలో, ఎన్‌కౌంటర్ల సందర్భంగా లభించిన పత్రాల విశ్లేషణలో ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జీఎన్‌పేటకు చెందిన నంబాళ కేశవరావు ప్రస్తుతం పార్టీ సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ (సీఎంసీ) చీఫ్‌ కమాండర్‌గా ఉన్నారు. ఇక ఎంసీసీఐ నుంచి వచ్చిన ప్రశాంత్‌బోస్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హిడుమ అలియాస్‌ వినోద్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు