కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఎం నో!

22 Jan, 2018 04:49 IST|Sakshi

ఏచూరి తీర్మానాన్ని ఓడించిన ప్రకాశ్‌ కారత్‌ బృందం

కోల్‌కతా: కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వర్గం ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానాన్ని పార్టీ కేంద్ర కమిటీ తోసిపుచ్చింది. ఈ మేరకు ఆదివారం కోల్‌కతాలో జరిగిన ఓటింగ్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారత్‌ నేతృత్వంలోని కేరళ బృందం ఏచూరి తీర్మానాన్ని ఓడించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 31 ఓట్లు, వ్యతిరేకంగా 55 మంది ప్రతినిధులు ఓటేశారు.

కాంగ్రెస్‌తో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి పొత్తు ఉండొద్దని ప్రకాశ్‌ కారత్‌ బృందం తేల్చిచెప్పింది. కేంద్రంలో బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకోవడమే మేలని ఏచూరి ప్రతిపాదించారు. మూడు రోజుల పాటు జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం ముగిసిన తరువాత ఏచూరి మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. సవరణలు చేసిన తరువాత ఆమోదం పొందిన తీర్మానంలో కాంగ్రెస్‌తో ఎలాంటి ఎన్నికల పొత్తు, అవగాహన కుదుర్చుకోవద్దని నిర్ణయించినట్లు వెల్లడించారు. త్రిపుర, పశ్చిమ బెంగాల్‌ ప్రతినిధులు అనుకూలంగానే ఉన్నా కేరళ సభ్యులు వ్యతిరేకించిననట్లు తెలిపారు.  

రాజీనామాకు సిద్ధపడ్డ ఏచూరి!
కారత్‌ బృందం తీర్మానాన్ని పార్టీలో అంతర్గతంగా చర్చించడానికి ఫిబ్రవరిలో విడుదల చేస్తారు. ఏప్రిల్‌లో పార్టీ సమావేశాలు జరగబోయే ముందు దీనిపై అభిప్రాయాలు సేకరిస్తారు. తన తీర్మానం ఆమోదం పొందకుంటే సీపీఎం ప్రధాన కార్యదర్శిగా తప్పుకోవాలని ఏచూరి అనుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తన ఓటమిని పసిగట్టిన ఏచూరి అసలు ఓటింగ్‌ జరగకుండా ఉండేలా ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇందుకోసం అత్యవసరంగా పొలిట్‌ బ్యూరో సమావేశం ఏర్పాటుచేసినా ఏకాభిప్రాయం కుదరలేదు.

కేంద్రకమిటీసభ్యుడి హఠాన్మరణం
ఈ సమావేశాలకు హాజరైన కేంద్ర కమిటీ సభ్యుడు, త్రిపుర అధికార లెఫ్ట్‌ఫ్రంట్‌ చైర్మన్‌ ఖగేన్‌దాస్‌(79) హఠాన్మరణం చెందారు. శనివారం వేకువజామున ఆయన తీవ్ర గుండెపోటుతో మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. దాస్‌ 1978, 1983 ఎన్నికల్లో శాసనసభ్యుడిగా, 1998–2002 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా, 2002 నుంచి 2014 వరకు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు.

మరిన్ని వార్తలు