క్రేన్‌ వాహనంతో ఢీ‌.. భారీ పరిహారం

27 Feb, 2018 15:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఓ క్రేన్‌ వాహనం కారణంగా తన కాలును శాశ్వతంగా కోల్పోయిన అశోక్‌ కుమార్‌ అనే 60 ఏళ్ల వ్యక్తికి భారీ నష్టపరిహారం అందింది. ఆయన కాలు పోవడానికి కారణమైన క్రేన్‌ వాహనానికి సంబంధించిన వాళ్లు రూ.44.82లక్షలు నష్టపరిహారం చెల్లించాలంటూ మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ అధికారి రాజ్‌కుమార్‌ చౌహాన్‌ ఆదేశించారు. ఈ మేరకు ఇఫ్‌కో టోకియో జనరల్‌ ఇన్సురెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌కు కూడా ఆదేశాలు జారీ చేశారు.

ఆ క్రేన్‌కు ఇన్సురెన్స్‌ అందించేది ఈ సంస్థే కావడంతో నష్టపరిహారం చెల్లించాలంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం అశోక్‌ కుమార్‌ తన కాలును పూర్తిగా కోల్పోయాడని, భవిష్యత్తులో కూడా అది తిరిగి మాములు కాలుగా పనిచేయదని, శాశ్వత వైకల్యం ఏర్పడినందున తమ ఆదేశాలు సరైనవేనంటూ సమర్థించుకున్నారు. దక్షిణ ఢిల్లీలో 2017 ఆగస్టు 2న సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఎన్‌బీసీసీ  భవనం వద్ద నడుచుకుంటూ వస్తుండగా నిర్లక్ష్యంగా క్రేన్‌ వాహనం నడుపుతూ వేగంగా వచ్చిన డ్రైవర్‌ అతడిని వెనుక నుంచి ఢీ కొట్టాడు. దాంతో అతడు కిందపడిపోగా అతడి ఎడమకాలు మీద నుంచి క్రేన్‌ వెళ్లిపోయింది. దాంతో 80శాతం ఆ కాలు పనిచేయకుండా అయిపోయింది. దాంతో అతడు కోర్టు మెట్లగా చివరకు అతడికి కొంత మేరకు న్యాయం జరిగింది.

మరిన్ని వార్తలు