‘క్రిమిలేయర్‌ ’  కొనసాగుతుంది

22 Mar, 2018 19:15 IST|Sakshi

బీసీ రిజర్వేషన్లలో ‘క్రిమిలేయర్‌ ’ కొనసాగుతుంది

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

 సాక్షి, న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్ల అమలులో క్రిమిలేయర్‌ నిబంధనను తొలగించే  ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని సామాజిక న్యాయ శాఖ మంత్రి కృష్ణ పాల్‌ గుర్జర్‌ రాజ్య సభలో గురువారం స్పష్టం చేశారు. ఓబీసీలలో క్రిమిలేయర్‌ కేటగిరీకి ఆదాయ పరిమితిని ఏడాదికి 6 నుంచి 8 లక్షలకు పెంచాలని జాతీయ బీసీ కమిషన్‌ సిఫార్సు చేసిందా? అని సంబంధిత మంత్రిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి కోరగా.. మంత్రి లేదని జవాబిచ్చారు.  

ఓబిసీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్‌ నిర్ధారణ కోసం వినియోగదారుల ధరల సూచీని ప్రాతిపదికగా చేసుకుని 2013లో ఎలాగైతే ఆదాయ పరిమితిని ఏడాదికి రూ. 6 లక్షలకు పెంచారో.. అదే ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న ఆదాయ పరిమితిని ఏడాదికి రూ.8 లక్షల పెంచినట్లు కృష్ణ పాల్‌ తెలిపారు.

ఓబీసీ క్రిమిలేయర్‌ కొనసాగుతుంది..
ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే ఓబీసీలలో కూడా క్రిమిలేయర్‌ విధానాన్ని తొలగించి రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయా సంఘాలుప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్న విషయం వాస్తవమేనా అని అడగగా.. క్రిమిలేయర్‌ నిబంధనను తొలగించాలంటూ ఓబీసీ నాయకులు, సంఘాలు డిమాండ్‌ చేస్తున్న మాట వాస్తవమన్నారు.  అయితే ఇందిరా సహానీ వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ప్రభుత్వం క్రీమీ లేయర్‌ విధానాన్ని అమలు చేస్తోందని వెల్లడించారు.

ఆదివాసీల వివరాలు లేవు..
భారత దేశంలోని పెద్ద పులుల అభయారణ్యాలలో నివసించే ఆదివాసీలు, ఇతర గిరిజనుల వివరాలేవీ తమ వద్ద లేవని విజయసాయి రెడ్డి ప్రశ్నకు సమాధానం ఆదివాసీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి  సుదర్శన్ భగత్  ఇచ్చారు.  వన్యప్రాణుల అభయారణ్యాలుగా గుర్తించిన ప్రాంతాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లుగా అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ గుర్తించింది.

ఈ నేపథ్యంలో పులుల అభయారణ్యాలలో నివసించే ఆదివాసీలు, గిరిజనులకు అటవీ హక్కుల చట్టాల ప్రకారం వారి హక్కులను పరిరక్షించాల్సిన విషయం వాస్తవమేనా అన్న ప్రశ్నకు మంత్రి అవునని జవాబిచ్చారు. అటవీ హక్కుల చట్టాల్ని అతిక్రమిస్తూ ఆదివాసీలు, గిరిజనులను బలవంతంగా అడవుల నుంచి తరిమేస్తున్న కేసులు ఏవైనా ప్రభుత్వం దృష్టికి వచ్చాయా అన్న ప్రశ్నకు, ఇప్పటి వరకు అలాంటి సంఘటనలేవీ తమ దృష్టికి రాలేదని  భగత్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు