వివాదాల ముసురు..!

27 Feb, 2018 02:13 IST|Sakshi
జయలలిత

అసెంబ్లీలో చిత్రపటం ఏర్పాటుపై.. కోర్టు సంచలన వ్యాఖ్యలు

స్పీకర్‌ కోర్టులోకి బంతి  విగ్రహంలో అమ్మ ఛాయలు లేవనీ...

దివంగత సీఎం జయలలిత తిరిగిరాని లోకానికి వెళ్లినా, వార్తల్లో వ్యక్తిగానే ఉన్నారు. అన్నాడీఎంకే వర్గాల తీరుతో ఆమె చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. అసెంబ్లీలో కొలువుదీర్చిన అమ్మ ఫొటోపై వాదం చెలరేగింది. కోర్టు కూడా  సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తులు స్పీకర్‌ కోర్టులోకి బంతిని నెట్టారు. 

సాక్షి, చెన్నై : పురట్చితలైవిగా, అమ్మగా తమిళుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకురాలు జయలలిత. ఆమె మరణం అనంతరం అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నాడీఎంకే పాలకుల పుణ్యమా అని తరచూ ఏదో ఒక రూపంలో అమ్మపై చర్చసాగుతూనే ఉంది. తమకు ఉన్న అధికారాలు ఉపయోగించి అసెంబ్లీలో అమ్మ నిలువెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, వివాదం రగిల్చారు. అసెంబ్లీలో ఆమె విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదంటూ కోర్టులో ఓ వైపు పిటిషన్‌ విచారణలో ఉన్న నేపథ్యంలో, దాన్ని ఉల్లంఘించి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. ఈ చిత్రపటం ఏర్పాటును వ్యతిరేకిస్తూ డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం  విచారణ జరిగింది.

స్పీకర్‌ కోర్టులోకి బంతి
ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని బెంచ్‌ ముందు సాగిన విచారణలో ఆ చిత్రపటం ఏర్పాటుకు వ్యతిరేకంగా పిటిషనర్‌ తరపున వాదనలు జోరుగా సాగాయి. ఆ వాదనల్ని పరిగణలోకి తీసుకున్నా, తాము అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తి స్పష్టం చేయడం గమనార్హం. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోమని, అసెంబ్లీలో స్పీకర్‌ నిర్వాకం వ్యక్తిగత ఇబ్బందులకు ఎవర్ని అయినా గురి చేస్తే, వాటిని విచారణకు తీసుకుంటామన్నారు. అందుకే 18 మంది  ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను తాము విచారిస్తున్నామని గుర్తు చేశారు. చిత్రపటం అసెంబ్లీలో ఉండాలా..? వద్ద అనేది ప్రజలు తేలుస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇందుకు తగ్గ ఫలితాలు ప్రతిబింబిస్తాయని, అప్పుడు కొత్తగా వచ్చే స్పీకర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం గమనార్హం.

విగ్రహంపై చర్చ
రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జయలలిత విగ్రహంలో ఆమె ఛాయలు లేవనే మరో చర్చకు తెరతీసింది. దీంతో ఆ పార్టీ ఎంపీ, పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై, మంత్రి ఎస్పీ వేలుమణి కూడా అమ్మ విగ్రహంలో మార్పులకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు.

తక్కువ సమయంలో తయారీ
 కాగా, అమ్మ విగ్రహం తయారు చేసినఆంధ్రప్రదేశ్‌కు చెందిన  శిల్పి  ప్రసాద్‌ స్పందించారు. విగ్రహం తయారీకి కొద్దిరోజుల క్రితం ఆర్డర్‌ ఇచ్చారన్నారు. తక్కువ సమయం కావడంతో సోదరుడు కామధేను ప్రసాద్, సిబ్బందితో రేయింబవళ్లు శ్రమించి, మొదట బంకమట్టితో విగ్రహాన్ని సిద్ధం చేసినప్పుడు ఎలాంటి అనుమానం కలగలేదన్నారు. విగ్రహం తయారయ్యాక పలు కోణాల్లో ఫొటోలు తీసి అన్నాడిఎంకే వర్గాలకు పంపించామన్నారు. వారు కూడా ఆక్షేపణ చెప్పలేదన్నారు. దీంతో తుది మెరుగులు దిద్ది చెన్నైకు తీసుకువచ్చామన్నారు.ఆ విగ్రహంలో అమ్మ ఛాయలు లేవనే విమర్శలు వస్తున్నందున తామే సరిదిద్దుతామన్నారు.  ఇప్పటికి ఎన్నో విగ్రహాలు తయారు చేసినా, పొరబాట్లు జరగలేదన్నారు. ఈ విగ్రహాన్ని సొంత ఖర్చుతో మార్పు చేస్తామని స్పష్టం చేశారు.

నన్ను అకారణంగా తొలగించారు
ఆ తరువాత అన్నాడీఎంకే నుంచి తనను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ  అన్నాకార్మిక సంఘం నేత చిన్నస్వామి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఇది వ్యక్తిగతం కావడంతో విచారణకు స్వీకరిస్తూ,  వివరణ ఇవ్వాలని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ అధ్యక్షుడు ఓ పన్నీరు సెల్వం,   ఉపాధ్యక్షుడు పళని స్వామి, ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి రెండో తేదీకి వాయిదా వేశారు.  

మరిన్ని వార్తలు