దళితులపై నేరాలు ఎనిమిదింతలు

9 Apr, 2018 03:03 IST|Sakshi

ఆదివాసీలపై నేరాల్లో 1,160% పెరుగుదల

దళితులపై నేరాల్లో మధ్యప్రదేశ్‌కు తొలిస్థానం

ఆదివాసీలపై దాడుల్లో మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్‌

పోలీస్‌స్టేషన్లలో ఎస్టీల పెండింగ్‌ కేసులు ఏపీలోనే అత్యధికం

ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం–1989 కింద నిందితుల్ని తక్షణ అరెస్ట్‌ చేయరాదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 2006తో పోల్చుకుంటే 2016 నాటికి దళితుల(ఎస్సీ)పై నేరాలు 746 శాతం (8 రెట్లు) పెరిగాయని ఇండియా స్పెండ్‌ అనే సంస్థ తెలిపింది. ఇక ఆదివాసీల(ఎస్టీ)పై నేరాల సంఖ్య ఈ పదేళ్లలో 1,160 శాతం(12 రెట్లు) పెరిగాయని వెల్లడించింది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) 2016లో విడుదల చేసిన గణాంకాలను విశ్లేషించిన అనంతరం ఈ నివేదికను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశజనాభాలో 20.1 కోట్ల మంది(16.6 శాతం) దళితులు, 10.4 కోట్ల మంది(8.6 శాతం) ఆదివాసీలు ఉన్నారు.  

మధ్యప్రదేశ్‌ టాప్‌
2006–16 మధ్య దేశవ్యాప్తంగా దళితులపై 4,22,799 నేరాలు జరిగాయి. గోవా, కేరళ, ఢిల్లీ, గుజరాత్, బిహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, సిక్కిం రాష్ట్రాల్లో ఈ నేరాల సంఖ్య 10 రెట్లు పెరిగిందని ఆ సంస్థ వెల్లడించింది. దళితులపై జరిగిన నేరాల్లో మధ్యప్రదేశ్‌(43.4%), గోవా (43.2%), రాజస్తాన్‌(42%) రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయంది.

ఇక ఆదివాసీలపై 37.5% నేరాలతో కేరళ తొలిస్థానంలో నిలవగా, అండమాన్‌–నికోబార్‌ దీవులు (21%), ఆంధ్రప్రదేశ్‌ (15.4%) తర్వాతి స్థానాల్లో నిలిచాయంది. దేశవ్యాప్తంగా ఈ పదేళ్లలో ఆదివాసీలపై 81,322 నేరాలు జరగగా.. వాటిలో అత్యధికం కేరళ, కర్ణాటక, బిహార్‌ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయంది. పోలీస్‌స్టేషన్లలో ఆదివాసీలకు సంబంధించి 405 పెండింగ్‌ కేసులతో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న నేరాల్లో దోషుల సంఖ్య 10 శాతానికి మించడం లేదని తెలిపింది.

కొండలా పేరుకుపోతున్న కేసులు
దళితులు, ఆదివాసీలపై ఈ పదేళ్లలో నేరాలు పెరిగినప్పటికీ.. పోలీస్‌స్టేషన్లు, కోర్టుల్లో అదే స్థాయిలో కేసుల పరిష్కారం జరగడంలేదని నివేదిక స్పష్టం చేసింది. దళితుల ఫిర్యాదులపై పోలీస్‌స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులు ఈ పదేళ్లలో 99 శాతం పెరిగాయని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు 50 శాతం పెరిగాయని తెలిపింది. 4,311 పెండింగ్‌ కేసులతో బిహార్‌ దేశంలోనే తొలిస్థానంలో ఉంది.

తప్పుడు కేసులు అంతంతే: దళితులు నిందితులపై పెట్టిన తప్పుడు కేసు ల సంఖ్యలో ఈ పదేళ్లలో ఎలాంటి పెరుగుదల లేదని ఆ నివేదిక తెలిపింది. 2006–16 మధ్య దళితులు పెట్టిన కేసుల్లో 5,347 తప్పుడు కేసులుగా తేలాయంది. వీటిలో రాజస్తాన్‌ 2,632 కేసులతో ముందుంది.

శిక్షపడుతున్న సందర్భాలు చాలా తక్కువ
దేశవ్యాప్తంగా దళితులు, ఆదివాసీలపై నేరాలకు పాల్పడిన ఘటనల్లో దోషులుగా తేలుతున్నవారి సంఖ్య 30 శాతానికి మించడం లేదు. దళితులపై జరిగిన నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 2006లో 28 శాతం ఉండగా, 2016 నాటికి 26 శాతానికి పడిపోయిందని ఆ నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, గుజరాత్, తమిళనాడు, గోవా, కేరళ రాష్ట్రాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 10 శాతానికి మించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే 2006లో ఆదివాసీలపై నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 28 శాతం ఉండగా, 2016 నాటికి ఇది 21 శాతానికి పడిపోయిందని పేర్కొంది.  పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేయడం, విచారణలో జాప్యం, బాధితులకు రక్షణ లేకపోవడం, ఎస్సీ, ఎస్టీ చట్టంలో సరైన సెక్షన్ల కింద కేసు నమోదుచేయకపోవడం కారణంగానే చాలామంది నేరస్తులు శిక్షపడకుండా తప్పించుకుంటున్నారంది.

–సాక్షి నేషనల్‌ డెస్క్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు