ఎన్‌కౌంటర్‌లో కమ్రాన్‌ హతం

19 Feb, 2019 03:47 IST|Sakshi
పుల్వామాలో ఎన్‌కౌంటర్‌ సందర్భంగా బాంబుదాడుల్లో ధ్వంసమైన ఓ ఇల్లు

పుల్వామా దాడి సూత్రధారిసహా ముగ్గురు జైషే ఉగ్రవాదుల మృతి

అమరులైన మేజర్‌ సహా ఐదుగురు భద్రతాదళ సిబ్బంది, పౌరుడు మృతి

శ్రీనగర్‌: కశ్మీర్‌లో 40మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలుకోల్పోయిన ‘పుల్వామా ఆత్మాహుతి ఉగ్రదాడి’కి సూత్రధారిగా భావిస్తున్న కమ్రాన్‌ అలియాస్‌ అబ్దుల్‌ ఘాజీ రషీద్‌సహా ముగ్గురు జైషే మహ్మద్‌ ముష్కరులను ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు హతమార్చాయి. సోమవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ మేజర్‌ సహా ఐదుగురు భద్రతా సిబ్బంది, ఓ పౌరుడు అమరులయ్యారు. పోలీస్‌ డీఐజీసహా 9 మంది సిబ్బంది గాయపడ్డారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రదేశానికి 12 కి.మీ.ల దూరంలోని పింగ్లాన్‌లో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది.

ఆదివారం రాత్రి  నుంచి సోమవారం వరకు దాదాపు 16 గంటలపాటు ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ కొనసాగింది. చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరిని కమ్రాన్, హిలాల్‌ అహ్మద్‌గా గుర్తించారు. కమ్రాన్‌ పాకిస్తాన్‌ జాతీయుడు, జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ టాప్‌ కమాండర్లలో ఒకరు. సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడికి ఇతడే సూత్రధారి అని అధికారులు భావించి ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. హిలాల్‌ అహ్మద్‌ కశ్మీర్‌కే చెందినవాడు కాగా మూడో ఉగ్రవాది ఎవరనేది తెలియాల్సి ఉంది. అమరులైన భద్రతా దళాల సిబ్బందిలో ఆర్మీ మేజర్‌ విబూది ధొండ్యాల్, హవల్దార్‌ శివరామ్, సిపాయిలు హరిసింగ్, అజయ్, పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఉన్నారు. డీఐజీ అమిత్, ఓ బ్రిగేడ్‌ కమాండర్‌సహా 9 మంది గాయపడ్డారు.  

ఉత్తరాఖండ్‌ నుంచి రెండో మేజర్‌
ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు ఆర్మీ మేజర్లు రెండు వరుస రోజుల్లో అమరులయ్యారు. ఓ వైపు హరిద్వార్‌లో మేజర్‌ చిత్రేశ్‌ బిష్ట్‌ అంత్యక్రియలు సోమవారం జరుగుతుండగానే, డెహ్రాడూన్‌కు చెందిన మరో మేజర్‌ విబూది ధొండ్యాల్‌ ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లో నేలకొరిగారు.

రాయబారిని వెనక్కు పిలిపించిన పాక్‌
ఇస్లామాబాద్‌: భారత్‌లో పాకిస్తాన్‌ రాయబారి మహ్మద్‌ ఫైజల్‌ను ఆ దేశం చర్చల కోసమంటూ వెనక్కు పిలిపించింది. పుల్వామా  దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో భారత చర్యకు ప్రతిచర్యగా పాక్‌ తమ రాయబారిని వెనక్కు రప్పించింది.  దాడి తర్వాత గత వారమే పాక్‌లో భారత రాయబారి అజయ్‌ను భారత్‌ వెనక్కు రప్పించింది.

బైక్‌ రిమోట్‌ కీతో ఐఈడీ పేల్చారు
న్యూఢిల్లీ: పుల్వామా ఘటనలో ఐఈడీని పేల్చేందుకు బైక్‌ రిమోట్‌ తాళం చెవిని వాడినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. గత దాడుల్లో వాడిన ఐఈడీలనూ కీలతోనే ఆపరేట్‌ చేసినట్లు భావిస్తున్నాయి. కశ్మీర్‌ ఉగ్రవాద వ్యతిరేక విభాగం తాజాగా రూపొందించిన నివేదికలో ఇలాంటి కీలక విషయాలున్నాయి. ఐఈడీలను పేల్చేందుకు బైక్, ఇతర వాహనాల్లో వాడే రిమోట్‌ కీ, వాకీటాకీ, సెల్‌ఫోన్‌ల్లో వాడే ఎలక్ట్రానిక్‌ పరికరాలను వాడుతున్నారు.

ఇవి మార్కెట్‌లో  సులువుగా లభ్యం కావడంతోపాటు భద్రతా బలగాలతో ముఖాముఖి తలపడే అవసరం లేకుండానే తీవ్ర నష్టం కలగజేస్తాయి. ‘కొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టులు వినియోగించుకుంటున్న సాంకేతికతనే భవిష్యత్తులో కశ్మీర్‌ ఉగ్రవాదులు అమలు పరిచే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో కశ్మీర్‌లోని భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని నివేదిక పేర్కొంది. ’కొన్నాళ్లక్రితం షోపియాన్‌లో ఐఈడీని పేల్చేందుకు బైక్‌ రిమోట్‌ కీ వాడారు. ఇటువంటివే గతంలో రెడ్‌ కారిడార్‌(మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు)లో మావోలు వాడారు. దీన్ని బట్టి వీరికీ వారికీ మధ్య సంబంధాలున్నట్లు భావించాల్సి వస్తోంది’ అని నివేదిక పేర్కొంది.

కశ్మీర్‌లో జరిగిన ఐడీఈ పేలుళ్లలో లభ్యమైన ఆధారాలను బట్టి.. ఆర్డీఎక్స్, పీఈటీఎన్‌(పెంటాఎరిత్రిటోల్‌ టెట్రానైట్రేట్‌), టీఎన్‌టీ(ట్రైనైట్రోటోలిన్‌) వంటి మిలటరీ గ్రేడ్‌ పేలుడు పదార్థాలతోపాటు విడిగా లభ్యమయ్యే అమోనియం నైట్రేట్, స్లర్రీస్‌ వంటి వాటిని ఐఈడీలను తయారు చేసేందుకు వాడినట్లు నివేదిక తేల్చింది. లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించేందుకు గాను ఉగ్రవాదులు ఐఈడీని ఎలక్ట్రానిక్‌ వైర్లతో అనుసంధానిస్తున్నారు. ‘దాడులకు కొత్త వ్యూహాలు, సాంకేతికత, పద్ధతులను అవలంభిస్తున్నారు. సైన్యంతో ప్రత్యక్షంగా తలపడేకంటే ఈ పద్ధతులు ఎంతో తేలికగా ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉండటంతో ఉగ్రవాదులు ఈ మార్గాలనే ఎంచుకుంటున్నారు’ అని ఆ నివేదిక పేర్కొంది. 

మరిన్ని వార్తలు