‘నా తండ్రిని చూస్తే గర్వంగా ఉంది’

16 Feb, 2019 11:27 IST|Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: కశ్మీర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమర జవాన్ల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వారికి సంబంధించిన విషాదగాథలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తండ్రిని కోల్పోయిన బిడ్డలు, భర్తలను కోల్పోయిన భార్యలు.. ఇలా ఒక్కొక్కరి వ్యథలు వర్ణనాతీతం. ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సీఆర్‌పీఎప్‌ జవాను ప్రసన్న కుమార్‌ సాహూ కూతురు రోజీ చేసిన వ్యాఖ్యలు కంటతడి పెట్టిస్తున్నాయి.

‘నాన్నను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. అదే సమయంలో దేశం కోసం ప్రాణాలొదిలిని నా తండ్రిని చూస్తే గర్వంగా ఉంది’అని ప్రసన్న కుమార్‌ సాహూ కూతురు రోజీ బాధతప్త హృదయంతో చేసిన వ్యాఖ్యలివి. రెండు నెలల సెలవులను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి వెళ్లిన ప్రసన్న కుమార్‌ ఇక తిరిగిరాడని కుటుంసభ్యులు, సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.  ఒడిశాకు చెందిన ప్రసన్న కుమార్‌ 1995లో సీఆర్‌పీఎఫ్‌లో చేరారు. అతనికి భార్య మీన, ఓ కూతురు, కొడుకు ఉన్నారు. సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రసన్న కుమార్‌, మనోజ్‌ బెహ్రా మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ దాడి పిరికి పందల చర్యగా అభివర్ణించారు. ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ప్రసన్న కుమార్‌, మనోజ్‌ బెహ్రాల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రదాడి
జమ్మూకశ్మీర్‌లో పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాన్వాయ్‌లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి.  పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది. 

మరిన్ని వార్తలు