అలర్ట్‌ : ఆ రాష్ట్రాలపై కరోనా పంజా

30 May, 2020 13:31 IST|Sakshi

న్యూఢిల్లీ : గత మూడు వారాల్లో కొత్తగా కరోనా వైరస్‌ కేసులు నమోదవుతున్న 145 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీటిలో గ్రామాలు ఎక్కువ కలిగి ఉన్న జిల్లాలే అధికంగా ఉండటం గమనార్హం. కరోనా నివారణకు సరైన చర్యలు తీసుకోకుంటే ఈ జిల్లాలు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. గురువారం  రాష్ట్రాల ప్రతినిధులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్‌ కార్యదర్మి రాజీవ్‌ గౌబా మాట్లాడుతూ.. భారత్‌లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తిరిగి వస్తుండటంలో త్వరలోనే ఈశాన్య రాష్ట్రాలు అతిపెద్ద కోవిడ్‌-19 హాట్‌స్పాట్‌లుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొదట నామమాత్రంగా కేసులు నమోదయిన బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశాతో సహా 12 రాష్ట్రాల్లో మే 25 వరకు వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరిగిందని తెలిపారు. ఇంతకముందు పదిలోపు కేసులు నమోదైన త్రిపుర, మణిపుర్‌ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా తాజాగా కేసులు అధికమవుతున్నాయని వెల్లడించారు. (ఒక్క రోజే 7,964 కరోనా కేసులు )

కొత్తగా 145 జిల్లాలను గుర్తించిన హోం మంత్రిత్వ శాఖ ఈ జిల్లాల్లో  కేసులు పెరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు నియంత్రణ చర్యలను తీసుకోవాలని చేయాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితిని బట్టి.. ఈ జిల్లాల్లో 2,147 కేసులు నమోదవుతుండగా, ఈ సంఖ్య దేశంలోని మొత్తం కేసులలో 2.5% ఉందని వీటిలో 26 జిల్లాల్లో 20కి పైగా యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.. వీటిలో సగం జిల్లాలు అస్సాం, ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా,మధ్యప్రదేశ్‌లోనే ఉన్నాయి. కాగా భారత్‌లో ఇప్పటి వరకు 1,65,000 కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో గత పదిహేను రోజులుగా కేసుల పెరుగుదల రేటు అధికంగా ఉందని పేర్కొంది. మే 13 వరకు దేశంలో 75 వేల కేసులు వెలుగు చూశాయని, ఇటీవల బీహార్, జార్ఖండ్, ఉత్తర  ప్రదేశ్‌, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కూడా కేసులు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది.

కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వలస కార్మికులు తిరిగి రావడం వల్లే ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. వలస కార్మికుల రద్దీ భారీగా ఉన్నందున, రైల్వే, బస్ స్టేషన్లలో ప్రయాణీకులకు సరైన పరీక్షలు చేయడం లేదని, అందువల్లే చాలామంది ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మహమ్మారిని అంటిస్తున్నారని పేర్కొన్నారు. (వాళ్ల కష్టాలు విన్నా.. చూశా: సీఎం జగన్‌ )

రాష్ట్రంలో ఉన్న 3,200 కేసులలో మూడింట రెండొంతుల మంది వలస కార్మికులే ఉన్నందున ప్రభుత్వం ఆందోళన చెందుతోందని బిహార్ ఆరోగ్య కార్యదర్శి లోకేష్ కుమార్ సింగ్ అన్నారు. బయటి క్వారంటైన్‌ కేంద్రాల నుంచి కొన్ని కేసులు మాత్రమే నమోదయ్యాయని జార్ఖండ్ మంత్రి రామేశ్వర్ ఓరన్ తెలిపారు. దీనితో వైరస్ వ్యాప్తి ఎక్కువగా లేదన్నారు. అధిక సంఖ్యలో కార్మికులు ఇతర ప్రదేశాల నుంచి తిరిగి వచ్చినప్పటికీ తాము వ్యాప్తిని నియంత్రించగలిగామని పేర్కొన్నారు.  (ఇక రాష్ట్రాలదే నిర్ణయం!)

మరోవైపు ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్ వంటి  రాష్ట్రాల్లో కోవిడ్ -19 నిర్ధారణ రేటు అధికంగా ఉండటంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మే 18 నుంచి మే 25 మధ్య కాలంలో దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌లలో కోవిడ్ -19 మరణాల రేటు పెరిగినప్పటికీ మిగతా చాలా రాష్ట్రాల్లో తగ్గినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాలతో పోలీస్తే  భారత్‌లో మరణాలు, కరోనా నిర్ధారణ సంఖ్య తక్కువగా ఉన్నాయని మాజీ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె కె అగర్వాల్ అన్నారు. 

మరిన్ని వార్తలు