వివాదాస్పద ట్వీట్‌.. క్షమాపణలు కోరిన డాక్టర్‌

18 Jun, 2020 17:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : తను చేసిన అనాలోచిత వ్యాఖ్యలపై ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌  డాక్టర్‌ మధు తోట్టపిల్లిల్‌ క్షమాపణలు కోరారు. చైనా- భారత్‌ బలగాల మధ్య సంఘర్షణపై అసంబద్ద ట్వీట్‌ చేసినందుకు తనను క్షమించాలని వేడుకున్నారు. భారత్‌- చైనా మధ్య జరుగుతున్న పోరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని డాక్టర్‌ మధు స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘జూన్ 16న నేను ఓ ట్వీట్‌ చేశాను. నేను మాట్లాడిన తీరు. ఉపయోగించిన పదాలు తప్పని తెలిశాక వాటిని డిలీట్‌ చేశాను. కానీ అప్పటికి నా ట్వీట్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నా దేశం గొప్పది. ఎంతో మంది సైనికులను, వీర జవానులను కలిగి ఉంది. వారిని తక్కువ చేసే ఉద్ధేశం లేదు. కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న సాహసోపేతమైన కృషిని నేను ఎప్పుడూ గౌరవిస్తాను’ అంటూ ఆయన క్షమాపణ నోట్‌లో రాశారు. (రోహిత్‌ను అమ్మాయిగా మార్చేశాడు..! )

అలాగే తన పోస్ట్ వేలాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని తనకు అర్థమైందని తోట్టపిల్లిల్‌ పేర్కొన్నారు. ‘నా ట్వీట్ చదివిన చాలా మంది బాధపడి ఉంటారు. వారందరినీ హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. పొరపాటున ట్వీట్ చేశాను. దీనికి ఎవరితోనూ, ఏ సంస్థతో సంబంధం లేదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల జవాన్ల కోసం ప్రధానమంత్రి తీసుకున్న రక్షణ గురించి నాకు తెలుసు. వీరు లేకుండా మనం సురక్షితంగా జీవించలేము. ఇక్కడితో ఈ సమస్య ముగిసిపోతుందని ఆశిస్తున్నా. మరోసారి నా అనాలోచిత మాటలకు క్షమించండి’ అంటూ ముగించారు. (జవాన్ల మరణంపై ట్వీట్‌: డాక్టర్‌ సస్పెన్షన్‌‌)

కాగా లఢఖ్‌‌లోని గాల్వన్‌ లోయలో ఈనెల 15న చైనా-భారత్‌ మధ్య జరిగిన సంఘర్షణలో 20 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరుల త్యాగాలను లెక్క చేయకుండా సీఎస్‌కు చెందిన డాక్టర్‌ మధురాజకీయంగా దుమారం లేపుతూ ట్వీట్‌ చేశాడు. ‘అమరులైన జవాన్ల శవపేటికలకు పీఎం కేర్స్‌ అనే స్టికర్లు అతికించి తీసుకొస్తారా. తెలుసుకోవాలని ఉంది’. అంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మధు చేసిన ట్వీట్‌ వివాదస్పదమవ్వడంతో తర్వాత కాసేపటికి ట్వీట్ డిలీట్ చేసి అకౌంట్‌ను ప్రొటెక్ట్ చేసుకున్నాడు. అప్పటికే సీఎస్‌కే జట్టు అతనిపై వేటు వేసింది. తొట్టపిల్లిల్ మధు చేసిన ట్వీట్‌ అతడి వ్యక్తిగత నిర్ణయమంటూ.. ఆ ట్వీట్‌తో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి ఏ సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయితే టీమ్ డాక్టర్ హోదా నుంచి మధును సస్పెండ్ చేస్తున్నట్లు సీఎస్‌కే తమ అధికారిక ఖాతా నుంచి ట్వీట్‌ చేసింది. (సరిహద్దు వివాదం: రాహుల్‌పై బీజేపీ ఫైర్‌)

మరిన్ని వార్తలు