డీఆర్‌ఐ దాడులు.. ఇంతలో నోట్ల వర్షం!

21 Nov, 2019 10:18 IST|Sakshi

కోల్‌కతా : ఓ వైపు డీఆర్‌ఐ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌) అధికారులు సోదాలు నిర్వహిస్తుండగానే.. మరోవైపు నోట్ల వర్షం కురవడం పశ్చిమబెంగాల్‌లో కలకలం రేపింది. ఈ ఘటన కోల్‌కతా(సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌)లో చోటుచేసుకుంది. వివరాలు.. బెంటింక్‌ వీధిలోని హోక్‌ మర్చంటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు సదరు ఆఫీసులో సోదాలు నిర్వహించారు. సరిగ్గా అదే సమయంలో ఆఫీసు బిల్డింగులోని ఆరో అంతస్తు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నోట్ల కట్టలు కిందపడేశారు.

ఈ క్రమంలో రూ. 2000, రూ. 500, రూ. 100 నోట్లు కిందకు పడుతుండటంతో బిల్డింగ్‌ కింద ఉన్న వారు వాటిని ఏరుకున్నారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ  విషయంతో రైడ్ జరిగిన కంపెనీకి సంబంధం ఉందా లేదా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు