అవినీతి ఫిర్యాదుల్లో టాప్‌ రంగాలివే..

9 Apr, 2018 19:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని అవినీతి కుంభకోణాలు పట్టిపీడిస్తున్నాయి. ఈ కోవలో ముఖ్యంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలపై పెద్ద ఎత్తున అవినీతి ఫిర్యాదులు రావడం ఆందోళన పుట్టిస్తోంది.  అవినీతి, అక్రమాలకు సంబంధించిన  ఫిర్యాదుల్లో రైల్వేలు, ప్రభుత్వరంగ బ్యాంకులు టాప్‌లో నిలిచాయి.  తాజాగా సీవీసీ అందించిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.  గత ఏడాది వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన నివేదికను సీవీసీ పార్లమెంట్‌కు సమర్పించింది.

2017 సంవత్సరానికి గానూ సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) ఈ సంచలన విషయాలను పార్లమెంటుకు నివేదించింది. అవినీతి నిరోధక విభాగానికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం సీవీసీ ఈ రిపోర్టును వెల్లడించింది. ఈ ఏడాది రైల్వే ఉద్యోగులపై 12,089, బ్యాకింగ్‌ ఉద్యోగులపై 8,018 ఫిర్యాదులు వచ్చినట్టు సీవీసీ నివేదికలో పేర్కొంది. ‍ దేశ రాజధాని ఢిల్లీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల మీద ఫిర్యాదులు గణనీయంగా పెరిగినట్టు  చెప్పింది.  సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌కు చెందిన ఉద్యోగులపై 2,730 ఫిర్యాదులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. అందుతున్న ఫిర్యాదుల్లో చాలా వరకు అస్పష్టంగా ఉంటున్నాయని సీవీసీ తెలిపింది. 2016తో పోలిస్తే 2017లో మొత్తం ఫిర్యాదుల సంఖ్య సగానికి తగ్గడం విశేషం.

ప్రపంచంలోనే భారతీయ రైల్వేలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి విభాగంలో పనిచేసే ఉద్యోగులపై ఇంత పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం ఆ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరోపక్క ఇటీవల దేశంలో కుంభకోణాలన్నీ కొందరు బ్యాంకింగ్‌ ఉద్యోగుల సహాకారంతోనే జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో వారిపై ప్రజలు ఈ స్థాయిలో ఫిర్యాదులు  చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు