మొబైల్స్‌ లక్ష్యంగా సైబర్‌ క్రైమ్స్‌

10 Apr, 2020 06:04 IST|Sakshi

పలు జాగ్రత్తలు సూచించిన నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కాలంలో సైబర్‌ నేరస్తుల దృష్టి స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులపై పడింది. లాక్‌ డౌన్‌ వల్ల అత్యధికులు స్మార్ట్‌ఫోన్స్‌ ద్వారానే ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో స్పైవేర్, రాన్సమ్‌వేర్‌ల ప్రమాదం వారికి పొంచి ఉందని జాతీయ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా(సెర్ట్‌–ఇన్‌)’ హెచ్చరించింది. వినియోగదారుడి ముఖ్యమైన వ్యక్తిగత డేటాను స్పైవేర్‌ సంగ్రహిస్తుంది. లాగిన్‌ వివరాల వంటి కీలక రహస్యాలను రాన్సమ్‌వేర్‌ తన అధీనంలోకి తీసుకుంటుంది. ఆ తరువాత యూజర్‌ నుంచి డబ్బు డిమాండ్‌ చేసి, ఆన్‌లైన్‌లో ఆ డబ్బు అందిన తరువాత అవి ఆ వివరాలను విడుదల చేస్తాయి. వ్యక్తిగత ఫోన్లను ఈ ప్రమాదాల నుంచి తప్పించేందుకు సెర్ట్‌–ఇన్‌ పలు సూచనలను ఇచ్చింది. అవి...

1) మొబైల్‌ పరికరణాలు, యాప్స్‌ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఫోన్లోని వ్యక్తిగత డేటాను జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి.
2) ఆపరేటింగ్‌ సిస్టమ్, యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుండాలి. ఓఎస్‌ను అందించే సంస్థలు కొన్ని అదనపు సెక్యూరిటీ ఆప్షన్స్‌ కూడా యూజర్స్‌కు అందుబాటులో ఉంచుతుంటాయి.
3) ఉపయోగించని యాప్స్‌ను తొలగించాలి.
4) అధికారిక యాప్‌ స్టోర్స్‌ నుంచే యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
5) ఫేస్‌బుక్, ట్విట్టర్‌ తదితర సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల ద్వారా ఇతర యాప్స్‌లోకి సైన్‌ ఇన్‌ కావడంపై అప్రమత్తంగా ఉండండి. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లతో అనుసంధానమైన యాప్స్‌ మీ వ్యక్తిగత సమాచారాన్ని ఆయా సైట్ల నుంచి తీసుకునే ప్రమాదముంది. అలాగే, ఆయా యాప్స్‌ నుంచి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు కూడా మీ సమాచారాన్ని సంగ్రహించవచ్చు.
6) ఎస్‌ఎంఎస్, ఈ మెయిల్‌ ద్వారా వచ్చే లింక్స్‌ను ఓపెన్‌ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. తెలియని సోర్స్‌ల ద్వారా ఆ లింక్స్‌ వస్తే వాటిని ఓపెన్‌ చేయకండి.
7) పాస్‌వర్డ్స్‌ను సేవ్‌ చేసుకోవాలని కొన్ని యాప్స్‌ కోరుతుంటాయి. అలా సేవ్‌ చేసుకోవడం అంత సురక్షితం కాదు. ఒకవేళ ఫోన్‌ పోతే, మీ వివరాలన్నీ బహిర్గతం అయ్యే ప్రమాదముంది.
8) పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌ను వాడే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ పబ్లిక్‌ వైఫై వాడాల్సి వస్తే.. యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసే యాప్స్‌ను ఓపెన్‌ చేయకండి. అలాగే, మీ ఫోన్లోని బ్లూటూత్‌ను అనవసరంగా ఆన్‌లో ఉంచకండి.
9) మొబైల్‌ డివైజ్‌ ఫ్యాక్టరీ సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను మార్చకండి.
10) మీ నియంత్రణ లేని కంప్యూటర్‌ లేదా చార్జింగ్‌ స్టేషన్‌ ద్వారా ఫోన్‌ ను చార్జింగ్‌ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండండి.

మరిన్ని వార్తలు