ఉంపన్‌.. కోల్‌కతా వణికెన్‌

22 May, 2020 05:08 IST|Sakshi
కోల్‌కతాలో గాలుల ఉధృతికి చెట్టు విరిగి పడటంతో రెండు ముక్కలైన బస్సు

72 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌లో తుపాను విలయం  

ధ్వంసమైన ఉత్తర, దక్షిణ పరగణాల జిల్లాలు

రాష్ట్రానికి అదనంగా 4 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు  

కోల్‌కతా/భువనేశ్వర్‌/న్యూఢిల్లీ/ఢాకా: కరోనా వైరస్‌తో దేశమంతా అల్లాడిపోతున్న సమయంలో పులి మీద పుట్రలా పశ్చిమబెంగాల్‌ను ఉంపన్‌ తుపాను గట్టి దెబ్బ తీసింది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ పరగణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 72 మంది మరణించారు. వందలాది ఇళ్లు నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వంతెనలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి తీవ్ర తుపాను ఉంపన్‌ దాటికి మహానగరం కోల్‌కతా చిగురుటాకులా వణికిపోయింది.

ఒక తుపాను ఈ స్థాయిలో కోల్‌కతాను ధ్వంసం చేయడం వందేళ్ల తర్వాత ఇదే తొలిసారి. గంటకి 190 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తూ ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి కోల్‌కతా అతలాకుతలమైంది. నగరంలో పలు ప్రాంతాల్లో పార్క్‌ చేసిన కార్లు గాలుల ధాటికి తిరగబడ్డాయి. కోల్‌కతాలో తుపాను బీభత్స దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రహదారులకి ఇరువైపులా ఉన్న వందలాది చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. వందలాది విద్యుత్‌ స్తంభాలు, వెయ్యికిపైగా సెల్‌ టవర్లు నేలకొరిగాయి.

ట్రాఫిక్‌ సిగ్నల్స్, పోలీసుల కియాస్క్‌లు ధ్వంసమయ్యాయి. కోల్‌కతాతో పాటు పశ్చిమబెంగాల్‌లోని కొన్ని జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మొబైల్‌ ఫోన్లు మూగబోయాయి. కమ్యూనికేషన్‌ సదుపాయం లేక అంత పెద్ద నగరం అల్లాడిపోతోంది. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలు పూర్తిగా ధ్వంసం కాగా, కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్, హౌరాలలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. కమ్యూనికేషన్‌ వ్యవస్థ ధ్వంసం కావడంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఇప్పట్నుంచే అంచనా వెయ్యలేమని ప్రభుత్వ అధికారులు చెప్పారు.

సుందర్‌బన్‌ డెల్టాలో కొన్ని కిలో మీటర్ల మేర ఈ పెను తుపాను విధ్వంసం సృష్టించింది. మరోవైపు తుపాను సహాయకకార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి మేరకు నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)కు చెందిన నాలుగు అదనపు బృందాలు ఢిల్లీ నుంచి కోల్‌కతాకు చేరుకున్నాయి. రెండు జిల్లాలు పూర్తిస్థాయిలో ధ్వంసం కావడంతో ఈ అదనపు బలగాలు వచ్చాయి. ఢిల్లీలో నేషనల్‌ క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశంలో బెంగాల్, ఒడిశాలో సహాయ కార్యక్రమాలపై చర్చించినట్టు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ ప్రధాన్‌ చెప్పారు.

ఒడిశాలో భారీగా పంట నష్టం
ఉంపన్‌ తుపాను ఒడిశాలో కూడా తన ప్రతాపం చూపించింది. తీర ప్రాంత జిల్లాల్లో విద్యుత్, టెలికం వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి. పంట నష్టం అత్యధికంగా ఉంది. రాష్ట్రంలో 44.8 లక్షల మందిపై తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. తీవ్రంగా నష్టపోయిన బెంగాల్‌ను అన్నివిధాల ఆదుకుంటామన్నారు.

బంగ్లాదేశ్‌లో 10 మంది మృతి: పెను తుపాను ఉంపన్‌ బంగ్లాదేశ్‌లోనూ విలయం సృష్టించింది. తీర ప్రాంతాల పల్లెలన్నీ ధ్వంసమయ్యాయి. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 10 మంది వరకు మరణించారని బంగ్లాదేశ్‌ అధికారులు వెల్లడించారు. గోడలు, చెట్లు కూలి మీద పడడం వల్లే ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు.  

కరోనా కంటే భయంకరమైనది : మమత
కోల్‌కతాతో పాటు పశ్చిమబెంగాల్‌ను వణికించిన ఉంపన్‌ తుపాను కోవిడ్‌–19 కంటే భయంకరమైనదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇలాంటి తుపాను బీభత్సాన్ని తన జీవితంలో చూడలేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ‘ఉత్తర దక్షిణ పరగణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని పునర్‌నిర్మించుకోవాలి. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చెయ్యాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంపన్‌ ప్రభావంతో అల్లాడిన ప్రాంతాలను సందర్శించాలి’ అని మమత అన్నారు.  

అండగా ఉంటాం: మోదీ
పశ్చిమ బెంగాల్‌ తుపాను తీవ్రతపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో బెంగాల్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుపాను బీభత్స దృశ్యాలు చూశానని, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి అన్ని విధాల సహాయం అందిస్తామని ట్వీట్‌ చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసంప్రా«ర్థిస్తున్నామని, జాతియావత్తూ బెంగాల్‌కు అండగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా బెంగాల్, ఒడిశాలకు కేంద్రం నుంచి పూర్తి సాయం అందుతుందని చెప్పారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌లతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు.  
నేడు ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే
ఉంపన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను శక్తివంతమైన ఉంపన్‌ తుపాను వణికిస్తోంది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తీర ప్రాంతాల్లో విద్యుత్, టెలికం, మౌలిక వసతులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఏరియల్‌ సర్వే ద్వారా పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి ప్రధాని మోదీ సిద్ధమయ్యారు.  

కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చేరిన వరద  
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు