తీరం దాటిన బుల్‌బుల్‌ తుపాను

10 Nov, 2019 17:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బుల్‌బుల్‌ తుపాన్‌ పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ద్వీపం వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటినా బుల్‌బుల్‌... పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తీరాలను వణికిస్తోంది హుగ్లీ, హౌరా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుల్‌బుల్‌ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో ఏడుగురు మృతి చెందారు. శనివారం రాత్రి తీరం దాటిన సమయం నుంచి ఆదివారం ఉదయం వరకూ తీవ్రగాలులు, వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.

తుపాను కారణంగా కరెంటు తీగలు తెగిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తుపాను ధాటికి 24 పరగణాస్‌, తూర్పు మిద్నాపూర్‌లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇక ఉత్తర 24 పరగణాలు జిల్లా కకావికలమైంది. కోల్​కతాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. అనేక చెట్లు కూలిపోయాయి. హోర్డింగులు ధ్వంసమయ్యాయి. విద్యుత్​ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 


మరోవైపు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు రంగంలోని దిగి సహాయ, పునరావాస చర్యలు చేపడుతున్నాయి. లోతట్టు తీర ప్రాంతాల నుంచి దాదాపు లక్షా 20వేలమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హౌరాలోని కంట్రోల్‌ రూమ్‌ నుంచి బుల్‌బుల్‌ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తుపానుపై సీఎం మమతా బెనర్జీతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుపాను పరిస్థితిని సమీక్షించానని మోదీ ట్వీట్‌ చేశారు. సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 


 

మరిన్ని వార్తలు