పూరీపై ‘ఫొని’ పంజా!

4 May, 2019 03:45 IST|Sakshi
తుపాను బీభత్సానికి ధ్వంసమైన పూరిలోని ఓ రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు, వాహనాలు

ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటిన ‘ఫొని’  

తుపాను బీభత్సానికి ఒడిశాలో ఎనిమిది మంది బలి 

ఏపీకి తప్పిన పెనుముప్పు.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు

సాక్షి నెట్‌వర్క్‌/భువనేశ్వర్‌/పూరీ: ఆంధ్రప్రదేశ్‌కు ‘ఫొని’ తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో దాదాపు పది రోజుల పాటు తుపానుగానే కొనసాగిన ‘ఫొని’ శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒడిశాలోని పూరీ సమీపంలో ఎట్టకేలకు తీరాన్ని తాకింది. అక్కడే అధిక ప్రభావం చూపించింది. ఆ సమయంలో గంటకు 175–205 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. తుపాను ధాటికి ఒడిశాలో ఎనిమిది మంది మరణించారు. తుపాను తీరాన్ని దాటాక అతితీవ్ర తుపానుగా బలహీనపడి ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తోంది. శుక్రవారం రాత్రికి ఇది ఒడిశాలోని బాలాసోర్‌కు నైరుతిగా 60 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు నైరుతి దిశగా 160 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించనుంది. తర్వాత మరింతగా బలహీనపడుతూ శనివారం నాటికి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి తుపానుగా, వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.  

 పూరీ నగరం ఏరియల్‌ వ్యూ... 

పెనుగాలులు.. కుండపోత వర్షాలు.. 
ఫొని తుపాను  ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలులు, భారీ వర్షాల ధాటికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు రహదారులు ధ్వంసమయ్యాయి. వేల సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో ఒడిశావ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. మరోవైపు సముద్ర తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. పూరీ క్షేత్రానికి వచ్చిన పర్యాటకులు వెంటనే నగరం విడిచి వెళ్లాలని అధికారులు చెప్పారు. తుపాను నేపథ్యంలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ప్రసాద్‌ పాఢి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 11 వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. మొత్తం 900 సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు.   

రైళ్లు, విమానాలు రద్దు  
ఒడిశాలో ముందు జాగ్రత్త చర్యగా రైలు, విమాన సర్వీసులను నిలిపివేశారు. కోల్‌కతా–చెన్నై మార్గంలో ప్రయాణించే 220కి పైగా రైళ్లను శనివారం వరకు రద్దు చేసినట్లు ఈస్టుకోస్టు రైల్వే అధికారులు వెల్లడించారు. భువనేశ్వర్, కోల్‌కతా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు రైల్వేశాఖ మూడు ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రధాన స్టేషన్లలోని స్టాళ్లలో ఆహార పదార్థాలు, తాగునీటిని సిద్ధంగా ఉంచినట్లు ప్రకటించింది. మరో మూడు రోజుల వరకు ఉద్యోగులు సెలవులు పెట్టొద్దని కోరింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్, పర్యాటక క్షేత్రం పూరీ రైల్వేస్టేషన్లు తీవ్ర గాలుల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వివిధ ప్రాంతాల్లో 34 సహాయక బృందాలు పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి.  ఫొని తుపాను గండం నుంచి బయటపడినా, భారీ వర్షాలు కురవడంతో ఒడిశాలో జన జీవనం స్తంభించిపోయింది.   

మరిన్ని వార్తలు