వేసవి తుపానులు ఊరకే రావు!

9 May, 2019 17:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత వారం ఒడిశాను అతలాకుతలం చేసిన ‘ఫొని’ తుపానుకు 38 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. ఇది వేసవి కాలపు తుపాను. గత 150 ఏళ్లలో ఇది రావడం మూడోసారి మాత్రమే. వాతావరణంలో అనూహ్యంగా మార్పులు వచ్చి బంగాళా ఖాతం జలాలు వేడక్కెడం వల్ల ఈ తుపాన్లు వస్తున్నాయి. భూతాపోన్నతి పెరగడం వల్లనే భూ వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తాయన్న విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రత ఇప్పటికే 46 డిగ్రీల మార్పును దాటిందంటే ఈసారి ఉష్ణోగ్రత తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయాయి.

వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల సుడి గాలులు, తుపానులు చెలరేగి ప్రకృతి నష్టాలతోపాటు మాన ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తాయని అందరికి తెల్సిందే. తెలియనిది మరొకటి ఉంది. పర్యావరణ పరిరక్షణ లోపించి వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించడం వల్ల జన్యుపరమైన నష్టం. అంటే కొన్ని జీవరాశులు పూర్తిగా నశించి పోవడం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు కోటి జీవరాశులు ఉండగా, వాటిలో ఇప్పటికే దాదాపు పది లక్షల జీవరాశులు నశించి పోయాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు నెలన్నరపాటు కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ కారణంగా వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులను దేశ ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు లేదుగానీ పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎన్నికల సందర్భంగా దేశంలోని దరిద్రం నుంచి దాష్టీకం వరకు, ఆకలి నుంచి అన్నపానీయాల వరకు, ఉపాధి నుంచి పదోన్నతుల వరకు, వైద్యం, విద్య, మౌలిక సదుపాయాలన్నీ చర్చకు వస్తాయిగానీ ఏనాడు వాతావరణ మార్పుల అంశం మాత్రం రాదు. కానీ ఈసారి మాత్రం వచ్చింది. ముక్తిసరికైనాగానీ పాలకపక్ష బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో కొన్ని పేజీలను వాతావరణ మార్పులకు కేటాయించాయి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పాయి. పునర్వినియోగ ఇంధనంపై దృష్టిని కేంద్రీకరిస్తామని, అడవులను పెంచే రాష్ట్రాలకు ‘గ్రీన్‌ బోనస్‌’ ఇస్తామని బీజేపీ వాగ్దానం చేయగా, దేశంలోని జల వనరులను సంరక్షిస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది.

గత 50 ఏళ్లలో వాతావరణ మార్పుల వల్ల దేశ జీడీపీ పురోగతిలో 30 శాతం కుంటుపడింది. అంటే వాతావరణ పరిస్థితులు సవ్యంగా ఉన్నట్లయితే నేడు మన జీడీపీ రేటు మరో 30 శాతం ఎక్కువ ఉండేది. పర్యావరణ పరిస్థితులను పరిరక్షించడంలో భాగంగా ప్రపంచంలోనే తొలి దేశంగా బ్రిటన్‌ ‘క్లైమేట్‌ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. భారత్‌ కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు