గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఆరుగురి మృతి

16 Oct, 2017 12:03 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇళ్లు కూలిన ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నగరంలోని ఎజిపురా ప్రాంతంలో సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. రెండంతస్థుల భవనంలో వంట గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలడంతో.. ఆ ధాటికి భవనం కుప్పకూలింది. దీంతో పాటు పక్కనే ఉన్న నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో నిండు గర్భిణీ సహా ఆరుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల సాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటి వరకు శిథిలాల కింది నుంచి ఇద్దరు చిన్నారులను సురక్షితంగా రక్షించారు.

శిథిలాల నుంచి వెలికితీసిన మృతదేహాలను కళావతి(68), రవిచంద్రన్‌(30)లుగా గుర్తించారు. ప్రస్తుతం సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి రామలింగా రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అలాగే బెంగళూరు అభివృద్ధిశాఖ మంత్రి కేజే జార్జి... మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. అలాగే  గాయపడినవారిని రూ.50వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారిని ప్రభుత్వం దత్తత తీసుకుంటుందని కేజే జార్జి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు