డబ్బావాలాలు.. రేటు పెంచారు!!

2 Jul, 2014 14:48 IST|Sakshi
డబ్బావాలాలు.. రేటు పెంచారు!!

క్రమం తప్పకుండా.. ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా సేవలు అందించే ముంబై డబ్బావాలాలు తమ రేటు పెంచారు. నిత్యావసరాల ధరలన్నీ పెరగడంతో వాటిని తట్టుకోడానికి నెలకు డబ్బాలు అందించడానికి ఛార్జీని వంద రూపాయలు చేశారు. ఈ సంక్షోభ సమయంలో తమకు అండగా ఉండాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ముంబై డబ్బావాలాల సంఘం మాజీ అధ్యక్షుడు రఘునాథ్ మెడ్గే తెలిపారు. తమ డబ్బావాలాలు ఆత్మహత్యలు చేసుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని, వాళ్ల కనీస జీవనం గడవాలంటే ఈ రేటు తప్పనిసరని చెప్పారు.

కూరగాయల ధరలతో పాటు రవాణా ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని, అందుకే ధరలు పెంచక తప్పలేదని రఘునాథ్ తెలిపారు. గడిచిన 125 సంవత్సరాలుగా ముంబైలోని 5వేల మందికి పైగా డబ్బావాలాలు ప్రతిరోజూ ఆఫీసులు, పాఠశాలలు, కళాశాలలకు లక్షకు పైగా భోజనం క్యారియర్లు ఇస్తున్నారు. వీళ్లకు నెలకు సుమారు రూ. 8వేల నుంచి 10 వేల వరకు ఆదాయం వస్తుంది. ప్రిన్స్ ఛార్లెస్, రిచర్డ్ బ్రాన్సన్ లాంటివాళ్లు కూడా ఈ వ్యాపారానికి అభిమానులే.  80 లక్షల డెలివరీలకు ఒక్క సారి మాత్రమే పొరపాటు జరుగుతుందని వీరిపై అంచనా.

మరిన్ని వార్తలు