నా వ్యాఖ్యల్లో తప్పుంటే క్షమించండి

11 Aug, 2018 04:40 IST|Sakshi
దలైలామాతో కుమారస్వామి

సాక్షి, బెంగళూరు: భారత తొలి ప్రధాని నెహ్రూ స్వార్థపరుడంటూ చేసిన వ్యాఖ్యలపై టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా క్షమాపణ చెప్పారు. మహ్మద్‌ అలీ జిన్నాను ప్రధాని చేయడానికి గాంధీ అనుకూలంగా ఉన్నా, నెహ్రూ స్వార్థపూరితంగా ఆలోచించారని బుధవారం దలైలామా అన్నారు. గాంధీ కోరుకున్నట్లు జిన్నా ప్రధాని అయ్యుంటే దేశ విభజన జరిగేది కాదన్నారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో క్షమాపణ చెప్పారు. ‘నేనేదైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి. గాంధీ దేశ విభజనను వ్యతిరేకించారని విని నమ్మలేకపోయా.

పాక్‌  కన్నా భారత్‌లో ముస్లింల జనాభా ఎక్కువ. గడిచిందేదో గడిచిపోయింది’ అని శుక్రవారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో అన్నారు. పాక్, భారత్‌ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దురదృష్టకరమని, భారత్‌ ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ సమస్య పరిష్కారానికి చొరవచూపాలన్నారు. తమ మాతృభూమి నుంచి వేలాదిగా వలసొచ్చిన టిబెటన్లను అక్కున చేర్చుకుని సొంత మనుషుల్లా చూస్తున్నందుకు భారత్‌ కృతజ్ఞతలు తెలిపారు. టిబెటన్ల సంస్కృతి పరిరక్షణకు నెహ్రూ ప్రాధాన్యమిచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం కుమారస్వామి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు