భవిష్యత్‌లో మహిళా దలైలామా!

15 Dec, 2018 03:50 IST|Sakshi

ముంబై: భవిష్యత్తులో మహిళా దలైలామా వచ్చే అవకాశ ముందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత ప్రబోధకులు దలైలామా అన్నారు. బౌద్ధ సంప్రదాయం చాలా ఉదారమైనదని, స్త్రీపురుషులిద్దరికీ బౌద్ధమతంలో సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం ఐఐటీ బాంబేలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘భవిష్యత్‌లో సమర్థవంతమైన మహిళ వస్తే కచ్చితంగా ఆమె మహిళా దలైలామా అవ్వచ్చు. ఎందుకంటే, బౌద్ధ సంప్రదాయం చాలా ఉదారవాదమైంది. ప్రస్తుతం భారత్, టిబెట్‌ దేశాల్లోని అత్యున్నత స్థానాల్లో పురుషులతో సమానంగా మహిళలు ఉన్నారు.

చిన్ననాటి నుంచే మానసిక పరిశుభ్రతకు చాలా ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎందుకంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మెదడు ప్రశాంతంగా ఉండాలి. మెదడు, భావోద్వేగాలకు సంబంధించిన జ్ఞానం భారత్‌లో 3 వేల ఏళ్ల కంటే పురాతనమైంది. 3 వేల ఏళ్ల పురాతన నాగరికత కలిగిన దేశం భారత్‌ ఒక్కటే. మెదడుని ప్రశాంతంగా ఉంచే పద్ధతులు భారత్‌లో అప్పటి నుంచే ఉన్నాయి. ఆనందం అనేది ప్రశాంతతకు సంబంధించినది. అయితే 20వ శతాబ్దంలో అత్యంత హింస చెలరేగుతోంది. 21వ శతాబ్దం మాత్రం దీన్ని పునరావృతం చేయరాదు. దయా హృదయంతో మానవ మేధస్సు అత్యంత ఆవశక్యమైంది’ అని దలైలామా అన్నారు.

మరిన్ని వార్తలు