ఏమైనా తప్పుంటే నన్ను క్షమించండి : దలైలామా

10 Aug, 2018 13:06 IST|Sakshi
దలైలామా (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ వంటి వ్యక్తులే తప్పులు చేశారన్న తన వ్యాఖ్యల్లో ఎదైనా తప్పు ఉంటే తనని క్షమించాలని టిబెట్‌ బౌద్ధ గురువు దలైలామా కోరారు. ప్రతీ ఒక్కరు జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పుచేస్తారని, నెహ్రూ వంటి వ్యక్తులే తప్పులు చేశారని ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలు ఉద్దేశ పూరితంగా చేసినవి కావని, ఏమైనా తప్పుంటే తనని క్షమించాలని శుక్రవారం ట్వీట్‌ చేశారు. గోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఇటీవల దలైలామా మాట్లాడుతూ.. దేశ తొలి ప్రధానిగా మహ్మద్‌ అలీ జిన్నాను చేయాలని మహాత్మ గాంధీ భావించారని, దానిని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారని దలైలామా పేర్కొన్నారు.

దేశ ప్రధానిగా తనకు అవకాశం ఇవ్వాలని నెహ్రూ పట్టుబట్టినట్లు కూడా ఆయన తెలిపారు. మహ్మద్‌ అలీ జిన్నాను గనుక ప్రధాని చేసి ఉంటే అవిభాజ్య భారత్‌ ముక్కలైయ్యేది కాదని దలైలామా ఇటీవల పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దలైలామా వ్యాఖ్యలపై బీజేపీ-కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో దలైలామా క్షమాపణలు కోరారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవమైనవని, గాంధీ మొదటి నుంచి జిన్నాను ప్రధాని చేయాలని ప్రయత్నించారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. నెహ్రూ కేవలం తన సొంత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారన్న వ్యాఖ్యలు నిజమైనవని, ఇలాంటి చారిత్రాత్మక విషాయాలపై మరింత లోతుగా చర్చ జరగాల్సిన అవసరముందని స్వామి తెలిపారు. 

మరిన్ని వార్తలు