మోదీ ఇలాకాలో ఇంత అంటరానితనమా!?

22 May, 2018 13:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల సందర్బంగా ‘గుజరాత్‌ తరహా అభివద్ధి’ దేశానికి అవసరమని అన్నారు. అందుకు కషి చేస్తానని హామీ కూడా ఇచ్చారు. గుజరాత్‌ తరహా అభివద్ధి ఆ రాష్ట్రంలో ఆర్థికంగా ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో తెలియదుగానీ సామాజిక అంతరాల్లో మాత్రం ఏ మాత్రం మార్పు తీసుకరాలేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఆదివారం నాడు దొంగతనం చేశాడనే అనుమానంపై 40 ఏళ్ల దళిత వ్యక్తిని ఓ స్తంభానికి కట్టేసి కొట్టి చంపేయడం. రాజ్‌కోట్‌ జిల్లాలో ముకేశ్‌ వానియా అనే వ్యక్తిని స్తంభానికి కట్టేసి కొడుతున్న వీడియా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న విషయం తెల్సిందే.

ఓ స్థానిక ఫ్యాక్టరీ వద్ద జరిగిన ఈ సంఘటనలో ముకేశ్‌ భార్యను కూడా చితక్కొట్టారు. ముకేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మరణించగా, ఆయన భార్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె కథనం ప్రకారం ఫ్యాక్టరీ సమీపంలో పాత ఇనుప సామాను ఏరుకుంటున్న ఆ దళిత దంపతులను ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన కొందరు వ్యక్తులు పిలిచారు. కులం గురించి వాకబు చేశారు. దళితులమని చెప్పడంతో ఫ్యాక్టరీ సమీపంలోని చెత్తా చెదారాన్ని పూర్తిగా ఏరివేయాల్సిందిగా ఆదేశించారు. అందుకు ఆ దంపతులు తిరస్కరించడంతో చితకబాదారు. ఈ సంఘటన నాడు 2016, గుజరాత్‌లోని ఉనాలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తోంది. ఆవు చర్మాన్ని వలుస్తున్నారన్న అనుమానంపై గోసంర క్షకులు నలుగురు దళితులను చితక బాదిన విషయం తెల్సిందే.

దేశంలోకెల్లా గుజురాత్‌లోనే దళితులు ఎక్కువగా అణచివేతకు, అంటరానితనానికి గురవుతున్నారని 2010లో ‘నవ్‌సర్జన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ విస్తతంగా నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. ఆ సంస్థ రాష్ట్రంలోని 98.4 శాతం గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించింది. 97.6 గ్రామాల్లో దళితులు హిందువుల వంటపాత్రలు, మంచినీటి బిందెలు ముట్టుకోరాదు. అలా ముట్టుకుంటే అవన్నీ కలుషితం అయినట్లు హిందువులు భావిస్తారు. 98 శాతం గ్రామాల్లో హిందువులు దళితులకు టీ పోయరు. కొందరు వారికి కేటాయించిన ప్రత్యేక కప్పుల్లో పోస్తారు. ఇక మతపరమైన కార్యక్రమాలకు దళితులను మరింత దూరంగా పెడతారు. 98 శాతం గ్రామాల్లో మతానికి సంబంధించిన వస్తువులను దళితులు అసలు తాకరాదు, ఈ అంటరానితరం కారణంగా బడులు, గుడుల వద్ద, గ్రామంలోని బావుల వద్ద తరచుగా దళితులపై దాడులు జరుగుతుంటాయి. దేశంలోని అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగంలోని 17వ అధికరణం గురించి హిందువులుగానీ, పాలకులుగానీ పట్టించుకోరు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాల క్రితమే భూసంస్కరణలు అమలు చేయగా, గుజరాత్‌లో మాత్రం ఇంతవరకు భూసంస్కరణలు అమలుకాలేదు. ఈ విషయమై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇటీవల భానూభాయ్‌ వాంకర్‌ అనే ఓ దళిత కార్యకర్త సజీవంగా దహనం చేసుకున్నారు.

రాష్ట్రంలో భూసంస్కరణలను అమలు చేయకపోవడం అటుంచి స్థానిక బీజేపీ ప్రభుత్వం ధనిక రైతులు, పారిశ్రామికవేత్తలు చిన్న రైతుల భూములను సులభంగా కొనుక్కోవడం లేదా కాజేసే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగిపోయి చిన్న రైతులు తమ పొలాలను అమ్ముకోవడం లేదా అప్పగించడం జరగకుండా ఎప్పటి నుంచో అమల్లో ఉన్న రక్షణ నిబంధనలను ఎత్తివేసింది. దళితుల తరఫున మాట్లాడుతున్న వారిని కూడా గుజరాత్‌ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ‘నవ్‌సర్జన్‌’ ఎన్జీవో సంస్థ రాష్ట్రంలోని దాదాపు మూడువేల గ్రామాల్లో దళితుల సంక్షేమం కోసం కషి చేస్తోంది. 2017లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్జీవోలకు విదేశీ విరాళాలను నిలిపివేయడంతో నవ్‌సర్జన్‌ సంస్థ ఉనికికే ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలో ఓట్ల కోసమైనా దళితులను ఆకర్షించేందుకు కొన్ని చర్యలు తీసుకున్నారు. గుజరాత్‌లో ఏ రాజకీయ పార్టీ కూడా దళితుల కోసం కషి చేయడం లేదు. దళితుల పక్షమంటే హిందువుల ఓట్లు కోల్పోవడంగానే ఆ పార్టీలు భావిస్తాయి.

మరిన్ని వార్తలు