‘మీరు దళిత ఎంపీ.. మా గ్రామానికి రావద్దు’

17 Sep, 2019 11:05 IST|Sakshi
ఎంపీ నారాయణ స్వామి (ఫైల్‌ఫోటో)

కర్ణాటకలో ఎంపీకి తీవ్ర అవమానం

దళితుడైనందున గ్రామంలోకి నిరాకరణ

సాక్షి, బెంగళూరు: దేశంలో కులవివక్ష జాఢ్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడూ ఎక్కడో ఓ చోట అణగారిన వర్గాలపై వివక్ష చూపిస్తూనే ఉన్నారు. అల్ప కులస్తులను చిన్నచూపు చూస్తున్నారు. అయితే ఈ వివక్ష సామాన్య ప్రజలనే కాక ప్రజా ప్రతినిధులను సైతం వెంటాడుతోంది. తాజాగా కర్ణాటకలో బీజేపీ ఎంపీ దళితుడైనందున తమ గ్రామంలోకి అడుగుపెట్టొద్దని గ్రామస్తులు తీవ్ర అవమానానికి గురిచేశారు. వివరాలు.. బీజేపీ ఎంపీ నారాయణ స్వామి కర్ణాటకలోని చిత్రదుర్గ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వర్షాకాలం కావడంతో తన లోక్‌సభ పరిధిలోని తూమకూరు జిల్లా పావగడ తాలూకులో పర్యటించారు.

గ్రామంలో మెడికల్‌ క్యాంపును నిర్వహించేందుకు వైద్య బృందాన్ని కూడా తన వెంట తీసుకెళ్లారు. అయితే వీరికి స్థానికులు (ఓ కులానికి చెందిన వారు) నుంచి అనుకోని ఘటనను ఎదుర్కొవల్సి వచ్చింది.  ‘మా గ్రామంలోకి దళితులు, అల్ప కులస్తులు రావడానికి వీళ్లేదు. మీరు అంటరానివారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపొండి’ అంటూ ఎంపీ బృందాన్ని తీవ్ర అవమానానికి గురిచేశారు. గ్రామంలో ఎంట్రీకి స్థానికులు అనుమతించకపోవడంతో గత్యంతరం లేక ఎంపీ అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే ఆ గ్రామంలోని వారంత ఒకే వర్గానికి (గొల్ల) చెందిన వారిగా తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులకే ఇలాంటి ఘటన ఎదురైన తమలాంటి వారి పరిస్థితి ఏంటని సామాన్యులు ఆవేదన ‍వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఘటనపై విచారణకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు