న్యాయకోవిదుడు దల్వీర్ భండారీ

21 Nov, 2017 21:17 IST|Sakshi

రాజస్థాన్ ఎడారి ప్రాంతం నుంచి దల్వీర్ భండారీ ప్రయాణం నెదర్లాండ్స్ నగరం హేగ్ వరకూ సాగుతుందని ఎవరూ అనుకోలేదు. న్యాయశాస్త్ర అధ్యయనం, ఆచరణతో ఆయన న్యాయరంగంలో ఎన్నెన్నో మెట్లు ఎక్కి ఐదేళ్లు క్రితం అంతర్జాయతీయ న్యాయస్థానంలో జడ్జీ అయ్యారు. 70 ఏళ్ల క్రితం జోధ్పూర్లోని న్యాయవాదవృత్తికి అంకితమైన జైన కుటుంబంలో జన్మించిన భండారీ జోధ్‌పూర్‌లో బీఏ చదివాక లా పట్టభద్రుడయ్యారు. తాత, తండ్రులు బీసీ భండారీ, మహావీర్ చంద్ భండారీల అడుగుజాడల్లో పయనిస్తూ మొదట జైపూర్లోని రాజస్థాన్ హైకోర్టులో 1968-70లో వకీలుగా ప్రాక్టీసు చేశారు. 1970 జూన్‌లో ఆయనకొచ్చిన ఓ అవకాశం ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. అమెరికా నగరమైన షికాగోలో భారత చట్టాలపై పరిశోధనపై యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఆరు వారాలు నిర్వహించే వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి భండారీకి ఆహ్వానం, అంతర్జాతీయ స్కాలర్‌షిప్ లభించాయి. షికాగోలోనే ఉన్న మరో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో మాస్టర్ ఆఫ్ లా చదవడానికి వెంటనే మరో స్కాలర్‌షిప్ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు.

షికాగోలో ఉన్న రోజుల్లోనే నార్త్ వెస్టర్న్ న్యాయ సహాయ క్లినిక్ తరఫున స్థానిక న్యాయస్థానాల్లో క్లినిక్ కక్షిదారుల తరఫున వాదించారు. ఇంకా అక్కడి సెంటర్ ఫర్ రిసెర్చ్ సంస్థతో కలిసి ఆయన షికాగోలో పనిచేశారు. తర్వాత 1973లో న్యాయస్థానాలు, లా కళాశాలలకు సంబంధించిన న్యాయ సహాయ కార్యక్రమాల అమలుపై పరిశీలనతో పాటు ప్రసంగాలు చేయడానికి భండారీకి మరో అంతర్జాతీయ ఫెలోషిప్ లభించింది. ఆయన ఈ సందర్భంగా థాయిలాండ్, మలేసియా, ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక దేశాల్లో పర్యటించి అంతర్జాతీయ చట్టాలు, వాటి అమలుపై విస్తృత అనుభవం సంపాదించారు. ఇంకా ‘ఇండియాలో నేర శిక్షాస్మృతి అమలులో జాప్యం’ అనే ఐక్యరాజ్యసమితి ప్రాజెక్టులో కూడా భండారీ విశేష సేవలందించారు. స్వదేశంలో ఉన్నత న్యాయస్థానాల్లో 21 ఏళ్లు, తర్వాత హేగ్ ప్రపంచ కోర్టులో విభిన్న కేసులపై తీర్పు చెప్పడానికి ఈ అంతర్జాతీయ అనుభవం భండారీకి ఎంతగానో ఉపకరించింది.

ఢిల్లీ నుంచి ముంబై -మళ్లీ ఢిల్లీకి!
1977లో లాయర్ ప్రాక్టీసును జైపూర్ నుంచి ఢిల్లీకి మార్చడంతో భండారీ దేశ రాజధాని హైకోర్టులో జడ్జీ కావడానికి పునాది పడింది. ఢిల్లీ హైకోర్టులో పదమూడేళ్ల ప్రాక్టీసు తర్వాత 1991లో అదే కోర్టులో ఆయన న్యాయమూర్తి అయ్యారు. 2004లో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా  2005లో సుప్రీంకోర్టు జడ్జీగా నియమితులయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సుప్రీం న్యామూర్తిగా పనిచేసిన ఎనిమిదేళ్లలో ఆయన చరిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. ఆయన రాసిన అనేక తీర్పులు అనాథలు, బడుగు బలహీనవార్గలకు మేలు చేసే విధంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని బాగా వెనుకబడిన ఐదు జిల్లాలకు ఎక్కువ నిధులు విడుదల చేయాలని, న్యాయవివాదాలు పరిష్కరించడానికి రాజీ కేంద్రాల ఏర్పాటుకు భండారీ ఇచ్చిన తీర్పులు ప్రజలకెంతో మేలేచేశాయి. ఇంకా ఆయన సుప్రీంకోర్టు జడ్జీగా దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న పేదలకు అధిక మొత్తంలో ఆహారధాన్యాలు విడుదల చేయాలని, ఇళ్లూ వాకిళ్లూ లేని పేదలకు రాత్రిపూట బసచేయడానికి నైట్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ ఆయన తీర్పులిచ్చి భారత ప్రభుత్వానికి బాధ్యతలు గుర్తుచేశారు.

విడాకుల కేసులో చరిత్రాత్మక తీర్పు!
సుప్రీంకోర్టు ముందుకొచ్చిన ఓ విడాకుల కేసు విచారించిన ధర్మాసనంలో ఉన్న భండారీ ఇచ్చిన తీర్పు చాలా గొప్పదనే ప్రశంసలందుకుంది. భార్యాభర్తల మధ్య ఏ మాత్రం రాజీకి అవకాశం లేదనే పరిస్థితి ఉంటే వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని ఆయన తీర్పు ఇచ్చారు. ఫలితంగా కేంద్ర సర్కారు ఇందుకోసం హిందూ వివాహ చట్టం సవరించే యోచనలో ఉంది. అలాగే బాలలందరికీ ఉచిత, నిర్బధ విద్య పొందడానికి హక్కు ఉందని ఆయన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో స్పష్టం చేయడంతో దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడం మొదలైంది.

సుప్రీంకోర్టు నుంచి ప్రపంచ న్యాయస్థానానికి...
భారత సర్వోన్నత న్యాయస్థానంలో 8 ఏళ్లు సేవలందించి పదవీ విరమణ చేయడానికి కొన్ని నెలల ముందు అంతర్జాతీయ న్యాయస్థానంలోని జడ్జీ రాజీనామాతో వచ్చిన ఖాళీ భర్తీచేయడానికి భారత ప్రభుత్వం భండారీ పేరు ప్రతిపాదించింది. 2012 ఏప్రిల్ 27న జరిగిన ఎన్నికల్లో భారత్ తరఫున పోటీచేసిన భండారీ మెజారిటీ ఓట్లతో ఫిలిప్పీన్స్ ప్రత్యర్థి ఫ్లారెంటినో ఫెలిషియానోను ఓడించారు. న్యాయకోవిదునిగా అందించిన విశేష సేవలకుగాను భండారీకి భారత ప్రభుత్వం 2014లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు రెండో విడత కోసం జరిగిన ఎన్నికతో 2018 ఫిబ్రవరిలో ప్రపంచ కోర్టు జడ్జీగా ఆయన రెండో పదవీకాలం మొదలవుతుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా