ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ

26 Apr, 2018 15:44 IST|Sakshi
హత్యకు గురైన జర్నలిస్ట్‌ సందీప్‌ శర్మ కుటుంబసభ్యులు

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకు పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యత తగ్గిపోతోంది. జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి. పత్రికా స్వేచ్ఛలో 180 దేశాలకుగాను గతేడాది భారత్‌కు 136వ స్థానం రాగా, ఈ ఏడాది 138వ స్థానం వచ్చింది. పత్రికా స్వేచ్ఛా సూచికను ‘రిపోర్టర్స్‌ సాన్స్‌ ఫ్రాంటియర్స్‌’ రూపొందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది. 1992 రెండు నుంచి ఇప్పటి వరకు 64 మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో హత్యలకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది స్థానిక రిపోర్టర్లే ఉన్నారు. స్థానికంగా అధికారంలో ఉన్న వ్యక్తి ఆగడాలకే వీరులో ఎక్కువ మంది బలయ్యారు.

2017 నుంచి హిందూత్వ శక్తుల దాడులకు జర్నలిస్టులు బలవుతున్నారు. కర్ణాటకలో జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య అలాంటిదే. ర్యాడికల్‌ హిందూత్వ శక్తులే ఆమెను హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. ఆరెస్సెస్‌ను అంత ఘాటుగా విమర్శించి ఉండకపోతే ఆమె ఈ రోజున బతికి ఉండేదంటూ ఓ బీజేపీ శాసనసభ్యుడు చేసిన వ్యాఖ్య ఇక్కడ గమనార్హం. 2017లో ఐదుగురు జర్నలిస్టులు హత్యలకు గురయ్యారు.

మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో 35 ఏళ్ల జర్నలిస్ట్‌ సందీప్‌ శర్మను డంపర్‌ యాక్సిడెంట్‌లో చంపేశారు. ఇసుక మాఫియాతో కుమ్ముక్కయిన పోలీసు అధికారి గురించి వార్త రాసినందుకు ఆయన బలయ్యారు. హత్య జరిగిన మరుసటి రోజే కేసును సిబీఐకి అప్పగిస్తున్నామని మధ్యప్రదేశ్‌ బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించినప్పటికీ ఇంతవరకు సీబీఐ అధికారులు కేసును టేకప్‌ చేయలేదు. ఇదే విషయమై వారిని అడిగితే తమకు ఎవరూ కేసును అప్పగించలేదని వారు తెలిపారు.

కేసును సీబీఐకి అప్పగించేవరకు ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును దర్యాప్తు చేస్తుందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 15 మంది జర్నలిస్టులు హత్యలు గురికాగా, ఏ ఒక్క కేసులో ఎవరికి శిక్ష పడలేదు. గడచిన దశాబ్దం కాలంలోనే ఏ ఒక్క జర్నలిస్ట్‌ హత్య కేసులో న్యాయం జరగలేదని అధికారిక వివరాలే తెలియజేస్తున్నాయి.

మరిన్ని వార్తలు