-

అంగడి సరుకుగా రేప్ వీడియోలు

4 Aug, 2016 09:09 IST|Sakshi
అంగడి సరుకుగా రేప్ వీడియోలు

ఆగ్రా: మహిళలపై అత్యాచారాలకు పాల్పడి వీడియోలు తీయడం, వీటితో బాధితులను బెదిరించడం వంటి నేరాలు నడుస్తున్న సమాజంలో అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. అత్యాచార బాధితులను బెదిరించడానికి ఉపయోగించుకుంటున్న రేప్ వీడియోలను ఉత్తరప్రదేశ్ లో అంగడి సరుకుగా మార్చేశారు. అబలలపై అకృత్యాలను దౌర్జన్యంగా చిత్రీకరించిన వీడియోలను అడ్డగోలుగా అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది 'డర్టీ' వ్యాపారులు.

పోలీసులు, అధికారుల కళ్లుగప్పి రోజుకు వందలు, వేల సంఖ్యలో రేప్ వీడియోలు అమ్ముతున్నారు. వీడియో క్లిప్ బట్టి ధర నిర్ణయిస్తున్నారు. 30 సెకండ్ల నుంచి 5 నిమిషాల నిడివివున్న వీడియోలను రూ.50 నుంచి రూ. 150కు అమ్ముతున్నారు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు దుకాణదారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నమ్మకమైన కొనుగోలుదారులకు మాత్రమే ఈ వీడియోలు అమ్ముతున్నారు. 'రిఫెరెన్స్' ఉన్న కస్టమర్లకు వీటిని విక్రయిస్తున్నట్టు తమ పరిశీలనలో తేలిందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వెల్లడించింది.

ఆగ్రాలోని బెలాన్ గంజ్, బాల్కెశ్వర్, కమలనగర్, ఇతర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యాపారం సాగుతోందని తెలిపింది. 'ఇలాంటి వీడియోలకు మంచి డిమాండ్ ఉంది. డీలర్లు స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసియిస్తారు. లేదంటే పెన్డ్రైవ్ లోకి కాపీ చేస్తారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన రేప్, వేధింపుల వీడియోలను కొంత మంది వ్యక్తులు లేదా గ్యాంగులు డౌన్ చేసి, అమ్ముతుంటాయి. ఒక్కోసారి రేపిస్టులు వీడియోలను ఆన్లైన్ లో పోస్ట్ చేస్తార'ని ఆగ్రాలోని కాసగంజ్ మార్కెట్ లోని ఓ దుకాణదారుడు వెల్లడించాడు.

మీరట్, బరేలీ లాంటి ఇతర నగరల్లోనూ ఈ దందా కొనసాగుతుంది. తనకు సంబంధించిన వీడియో ఆన్లైన్ లో కనబడడంతో గతవారం 21 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. మహిళల మానప్రాణాలకు బలిపెడుతున్న ఈ దందాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు