మంత్రాల్లోనే న్యూటన్‌ నియమాలు!

1 Mar, 2018 01:42 IST|Sakshi
సత్యపాల్‌ సింగ్‌

చదువు రావాలంటే స్కూళ్లకు వాస్తు ఉండాలి

కేంద్రమంత్రి సత్యపాల్‌ వ్యాఖ్యలు  

న్యూఢిల్లీ: డార్విన్‌ జీవపరిణామ సిద్ధాంతం తప్పని వాదించిన కేంద్ర మానవవనరులశాఖ సహాయమంత్రి సత్యపాల్‌ సింగ్‌.. మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐజాక్‌ న్యూటన్‌ ప్రతిపాదించిన గమన నియమాలు(లాస్‌ ఆఫ్‌ మోషన్‌) మన మంత్రాల్లో ఎప్పటినుంచో ఉన్నాయని సత్యపాల్‌ సింగ్‌ తెలిపారు. గత జనవరిలో హెచ్‌ఆర్డీ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన 65వ సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(సీఏబీఈ) భేటీలో సత్యపాల్‌ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

కాబట్టి సంప్రదాయ జ్ఞానాన్ని కచ్చితంగా మన పాఠ్యాంశాల్లో చేర్చాలని సత్యపాల్‌ సూచించారు. అంతేకాకుండా పాఠశాల భవనాలు పూర్తి వాస్తుతో ఉండాలనీ.. అప్పుడే విద్యార్థులకు చదువు అబ్బుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా న్యూటన్‌ మంత్రాల విషయమై మీడియా ఆయన్ను బుధవారం ప్రశ్నించగా.. సత్యపాల్‌ జవాబు దాటవేశారు. అంతేకాకుండా డార్విన్‌ విషయంలో తాను చెప్పింది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేననీ, దానికి ప్రభుత్వం, పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వివరణ కూడా ఇచ్చారు.

మరిన్ని వార్తలు