ఉపాధ్యాయుడిగా మారిన మాజీ ఎమ్మెల్యే

18 Jun, 2020 14:15 IST|Sakshi

బెంగళూరు :  కరోనా నేపథ్యంలో అన్ని పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటకలో మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 9 వరకు నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలు కూడా నిలిచి పోయాయి. ఈ క్రమంలో ఇన్నేళ్లు రాజకీయాల్లో బిజీగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే దాదాపు 25 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయుడిగా మళ్లీ తన వృత్తిని కొనసాగిస్తున్నారు. అయితే ఈ సారి తరగతి గదిలో విద్యార్ధుల ముందు బోధించడం లేదు. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా విద్యార్థులకు గణితం, భౌతిక శాస్త్రం పాఠాల్ని చెబుతున్నారు. ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా పదో తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఆయన ఎవరో కాదు. కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లా కదూర్‌ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ప్రజలకు సేవలు అందించిన వైఎస్వీ దత్తా. 1970లో రాజకీయాల్లో ప్రవేశించిన దత్తా 1990 నుంచి జనతాదళ్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు. చాలా కాలం రాజకీయాల్లో పనిచేసిన దత్తా ప్రస్తుతం ఉపాద్యాయుడిగా మారి మరోసారి తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేశ్‌కుమార్‌ అభినందించారు. (సుశాంత్‌ సోదరి భావోద్వేగ లేఖ )

కాగా, రాజకీయాల్లోకి రాకముందు దత్తా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. బెంగుళూరులో డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు గణితం బోధించేవారు. ఆ అనుభవంతోనే ఈ సమయంలో విద్యార్థులకు మళ్లీ అధ్యాపకుడిగా మారారు. స్టూడెంట్స్‌ ఆయన మీద ప్రేమతో దత్తా మేష్ట్రే(మాస్టారు) అని పిలుచుకుంటారు.  దత్తా మొదటి ఆన్‌లైన్‌ క్లాస్‌ అర్థమెటిక్‌ గురించి వివరించగా దానికి విశేష స్పందన లభించింది. లాక్‌డౌన్‌ ద్వారా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్‌ 25 నుంచి జూలై 4 వరకు జరగనున్నాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. గణితంతో పాటు విద్యార్థుల అభ్యర్థన మేరకు భౌతికశాస్త్రం కూడా నేర్పిస్తున్నానని వెల్లడించారు. అయితే తక్కువ సమయం ఉన్నందువల్ల కఠినమైన విషయాలను మాత్రమే విద్యార్థులకు బోధిస్తున్నట్లు తెలిపారు. తన సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తిలో 40 వేల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పినట్లు తెలిపారు. ఎల్లప్పుడూ ఉపాధ్యాయునిగా ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు. (కల్నల్‌ సంతోష్‌కు కాంస్య విగ్రహం )

మరిన్ని వార్తలు