చందాదారులకు 50 వేల లాయల్టీ

14 Apr, 2017 00:43 IST|Sakshi
చందాదారులకు 50 వేల లాయల్టీ

ఈపీఎఫ్‌ఓ కొత్త కానుక
► కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో సిఫార్సు

న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌ చందాదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) కొత్త కానుకను అందివ్వనుంది. ఉద్యోగ విరమణ సమయానికి 20 ఏళ్లకంటే ఎక్కువ కాలం చందా చెల్లించిన వారికి లాయల్టీ కమ్‌ లైఫ్‌ బెనిఫిట్‌ కింద రూ.50,000 చెల్లించాలని ఈపీఎఫ్‌ఓ బోర్డు నిర్ణయించింది. శాశ్వత అంగవైకల్యం ఉన్న వ్యక్తులు 20 ఏళ్లు చెల్లించకపోయినా వారు ఈ ప్రయోజనం పొందొచ్చు.

ప్రతిపాదిత ప్రథకం ప్రకారం.. మూలవేతనం రూ.5 వేల వరకూ ఉన్న వారు లాయల్టీ కమ్‌ లైఫ్‌ బెనిఫిట్‌ కింద రూ.30,000, మూలవేతనం రూ.5,001–10,000 మధ్య ఉన్న వారు రూ.40,000 పొందవచ్చు. రూ.10 వేలకంటే ఎక్కువ మూలవేతనం పొందే వారు రూ.50 వేల ప్రయోజనం పొందుతారు. కేంద్ర ట్రస్టీల బోర్డు(సీబీటీ) బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చందాదారుడు మరణిస్తే కుటుంబానికి రూ.2.5 లక్షల కనీస బీమా అందజేయాలని సిఫార్సు చేసింది. కేంద్రం ఆమోదిస్తేఈ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. పైలట్‌ ప్రాజెక్టుగా రెండేళ్ల పాటు దీనిని కొనసాగిస్తామని, ఆ తర్వాత సమీక్షించి కొనసాగించే అంశంపై నిర్ణయం తీసుకుంటారు.

8.65% వడ్డీ అందిస్తాం: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: 2016–17కు గాను గత డిసెంబర్‌లో నిర్ణయించిన విధంగానే పీఎఫ్‌ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని అందిస్తామని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ చెప్పారు. అవసరమైతే ఆర్ధిక మంత్రిత్వ శాఖతో చర్చిస్తామని, ఇప్పటికే 8.65 శాతం వడ్డీ రేటును ఆమోదించాలని ఆర్ధిక శాఖను కోరానని, కార్మికులకు డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని అందించాల్సిందేనని దత్తాత్రేయ అన్నారు.

ఈపీఎఫ్‌ ప్రయోజనాలను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆధార్‌ సీడింగ్‌ అప్లికేషన్‌ను ఆయన ప్రారంభించారు.  పీఎఫ్‌ సభ్యుడు లేదా పెన్షనర్‌ స్వయంగా ఏదైనా ఈపీఎఫ్‌ఓ ఫీల్డ్‌ ఆఫీసుకు లేదా కమాండ్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎస్‌సీ)కు వెళ్లి ఈ అప్లికేషన్‌ ద్వారా ఆధార్‌ను తన పీఎఫ్‌ ఖాతాకు అనుసంధానించుకోవచ్చు.

మరిన్ని వార్తలు